Telangana | మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్నటి దాకా దేశానికే అన్నపూర్ణగా మారామంటూ సగర్వంగా చాటుకున్న తెలంగాణ అన్నదాత నేడు దుఃఖిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో ఠంచన్‌గా అందిన రైతుబంధు నిలిచిపోవడం, తాము ఆశించినవిధంగా రూ.2 లక్షల రుణమాఫీ కాకపోవడం రైతన్నను కుంగదీస్తున్నది. సాయం మాట దేవుడెరుగు కనీసం తమను ఓదార్చే వారే కరువయ్యారన్న వేదన వారిని మరింత కలవరపెడుతున్నది. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ తొలిరోజు పర్యటనలో ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. కమిటీ పర్యటించిన గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి కమిటీ సభ్యుల ముందు తమ గోడు వెళ్లబోసుకోవడం కనిపించింది.
అప్పుల బాధలకు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు, యావత్ తెలంగాణ సమాజానికి భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారి పర్యటించింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తండా గ్రామానికి చెందిన ఆడే గజానంద్, బేల మండలం రేణిగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావ్ కుటుంబాలను పరామర్శించింది. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సభ్యులు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్ రైతు కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆత్మహత్యలకు గల కారణాలు, ప్రభుత్వం నుంచి అందిన సాయంపై ఆరా తీశారు. కమిటీ ముందు స్వచ్ఛంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ధైర్యం వీడొద్దని, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వేలాది మంది అమరులై పోరాటాలు చేసి, వెలకట్టలేని త్యాగాలు చేసి రాష్ర్టాన్ని తెచ్చింది సచ్చిపోయేందుకు కాదని ఉద్బోధించారు. మనం అజాగ్రత్తగా ఉండటం, దుష్ప్రచారాలు, దుష్ప్రభావాల కారణంగా రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి పోయిందని చెప్పారు. ‘మనం ధైర్యం వీడకుండా బతకాలి. మన బిడ్డలను బతికించుకోవాలి. కొట్లాడాలే తప్ప వెనక్కి పోవద్దు. పోరాటానికి సిద్ధం కావాలి., సర్కారును ఎండగట్టాలి’ అని పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో చేయూత..
కేసీఆర్ హయాంలో దేశంలో అనేక రాష్ర్టాల్లో పలు కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. తెలంగాణలో మాత్రం క్రమంగా రైతు ఆత్మహత్యలు తగ్గాయని, ఈ విషయాన్ని మోదీ సర్కారే పార్లమెంట్లో ప్రకటించిందని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి కేసీఆర్ దారిచూపించారని వివరించారు. కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం, పంటలకు మార్కెట్ ధర, రైతుబీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు ఇలా అన్నీ ఇచ్చి తెలంగాణలో ఉండే ఏ కుటుంబానికైనా చేయూతనందించే పరిస్థితిని కేసీఆర్ హయాంలో చూశామని వివరించారు. కానీ, కాంగ్రెస్ హయాం లో కంటతడి పెట్టని కుటుంబం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామసభల్లో ఈ ప్రభుత్వం తాము అనుకున్న దారిలో పోవడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు.
ఆ పార్టీ కోసం పని చేసిన కుటుంబాలే కంటతడి పెట్టే పరిస్థితిని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. రెండు లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని, అయితే రూ.1.96,000 అప్పున్న దేవరావ్ ఎందుకు చనిపోయిండో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కానీ రైతులు రాష్ట్రంలో 50% వరకు ఉన్నారని తెలిపారు. ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కాలేదని చెప్పేవారే ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం.. ఇప్పటికి రూ.20 వేల కోట్ల రుణం మాఫీ అయ్యిందని.. ఇంకా రూ.21 వేల కోట్లు రైతులకు చేరాల్సి ఉన్నదని వివరించారు. రైతుభరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామన్నోళ్లు.. కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రేపోమాపో రైతు భరోసా ఇస్తామని, కౌలురైతులకు, వ్యవసాయ కూలీలకు సైతం డబ్బులు ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నమే తప్ప నిజంగా రైతులకు విశ్వాసం కల్పించే పని ఈ ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.
సాగునీటి నిర్వహణలో విఫలం
ఈ ఏడాది రికార్డుస్థాయి వర్షాలు పడినా శ్రీరాంసాగర్, మానేరు, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వడానికి ఈ సర్కారుకు చేత కాలేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. వానకాలంలో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రం పాలైందని, నీటి యాజమాన్యాన్ని కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. నీళ్లు ఉన్నా ఎందుకు ఇవ్వలేకపోయారో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వర్గ ప్రజల అవసరాలు ఏమిటో ఈ ప్రభుత్వానికి స్పష్టత లేదని, ఎవరికి ఏ పని చేస్తున్నరో తెలియని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 408 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతమంది చనిపోతే కనీసం మంత్రులు ధైర్యం చెప్పింది లేదని మండిపడ్డారు. ‘ఈ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు అనాథలైపోయారా? దిక్కులేనోళ్లు అయిపోయారా? ఇదేనా మీరు కోరుకున్న మార్పు? ఇదేనా ప్రజలు ఆశించిన మార్పు?’ అని ప్రశ్నించారు. నాలుగు వందల రోజుల్లో 400 పైచిలుకు రైతులు చనిపోయే పరిస్థితి కల్పించడమేనా గొప్ప మార్పు అని నిలదీశారు.
రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు
ప్రభుత్వానికి స్వయం నిర్దేశిత లక్ష్యం, ఎటువైపు పోవాలనే గమ్యం, ఏంచేయాలనే దిశానిర్దేశం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులను వంచించి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్లకు డబ్బులు వేస్తామని చెప్పి ఆశపెట్టి వారికి ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఇలా ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని వివరించారు. కూలి పనులు చేసుకొనేవారు కూడా ఎప్పుడు తమ ఇండ్లు కూలగొడుతారోననే భయంతో నిద్రపోవడం లేదని చెప్పారు. హైడ్రా పేరుతో ప్రజలను భయకంపితులను చేశారని విమర్శించారు. వర్తక, వాణిజ్య వర్గాలను గుప్పెట్లో పెట్టుకొని దురుద్దేశాలతో ఏదో లబ్ధిపొందడానికి చేసిన పనులే తప్ప ప్రభుత్వం నిజంగా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘వ్యవసాయ రంగం కూనరిల్లితున్నది. ఐటీ పడిపోతున్నది. రియల్ఎస్టేట్, భూముల ధరలు పడిపోయాయి. ఇదంతా పెరుగుదలేనా? ఇదంతా మీ పుణ్యాత్ముల కాలు బలమేనా? ఇదంతా మీ పరిపాలన దక్షతకు నిదర్శనమేనా? ఇదేనా ప్రజాపాలన? ఇవన్నీ వేలెత్తి చూపిస్తే.. ఇవన్నీ ప్రశ్నిస్తే.. ఎదురుదాడి చేయడం తప్ప ఏం చేయాలేరా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అద్భుతాలను చిన్నగ చేసి చూపిండ్రు
రైతులకు నేరుగా లబ్ధి జరిగేలా స్కీమ్‌లను ఆలోచన చేసి, అమలుచేసిన ఏకైక మొనగాడు కేసీఆర్ అని నిరంజన్‌రెడ్డి కొనియాడారు. యాభై, అరవై ఏండ్లు పాలించినవారు చేయని పనులను కేసీఆర్ చేసి చూపిస్తున్నారనే అక్కసుతో, వాటిని చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేశారని, వాళ్లకు అనుకూలంగా ఉండే మీడియా ద్వారా నిరంతరం బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
ప్రభుత్వం ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే నడవదని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలను సంఘటితం చేయడానికి, ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచడానికి బీఆర్ఎస్ పార్టీ తోడ్పడుతుందని, రైతులకు బాసటగా ఉంటామని చెప్పారు. అన్నదాతను కాపాడే పనిలో తలా ఒక చేయి వేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయాలని, లేనిపక్షంలో ప్రజాపోరాటం తప్పదని చెప్పడానికే ఈ పర్యటన చేపట్టామని స్పష్టంచేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల పరామర్శకు నెల రోజులు కాకపోతే ఇంకా ఎక్కువ రోజులైనా తిరుగుతామని చెప్పారు.
గిరిజన బిడ్డల ఉసురు తప్పదు: సత్యవతి రాథోడ్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజన బిడ్డల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో ఆమె ప్రత్యేకంగా వారికి అర్థమయ్యే లంబాడీ భాషలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రైతులకు ఎంత అప్పు ఉన్నా రూ.2 లక్షలు అందరికీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. వారి తరఫున ప్రభుత్వంతో బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. ప్రజలను, రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని, కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని అన్నారు.
సాయం అందకనే గజానంద్ ఆత్మహత్య
బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలుత.. గుడిహత్నూర్ మండలం నేరడిగొండతండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఆడె గజానంద్ కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా గజానంద్ భార్య అనిత తమ కన్నీటి గాధ వినిపించారు. ‘గజానంద్‌కు బ్యాంక్‌లో రూ.2,09,000 రుణం ఉన్నది. మాఫీ అయితదని ఎదురు చూసిండు. కాలేదు. బ్యాంకోళ్ల తమాషా ఎక్కువైపోయింది. అభిమానం అడ్డం వచ్చింది. అందరి ముందట అప్పులోడు వచ్చి ఇబ్బంది పెడుతున్నడని.. చిన్నబుచ్చుకొని ఆత్మహత్య చేసుకున్నడు. పత్తిచేనులోనే మందు తాగి కుప్పకూలిపోయిండు. రైతుబంధు రాకపోవడం ఒకటి, రైతుభరోసా ఇయ్యకపోవడం రెండు.. చివరకు రుణమాఫీ కాకపోవడంతోనే గజానంద్ చనిపోయిండు’ అంటే ఆమె కమిటీకి తన కష్టాన్ని చెప్పుకొని బోరుమని విలపించింది.
బాధిత కుటుంబాలకు లక్ష సాయం
బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటనలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తండా గ్రామానికి చెందిన ఆడే గజానంద్ అనే రైతుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.లక్ష చెక్కును అందజేశారు. బేల మండలం రేణిగుంట గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావ్ కుటుంబానికి మాజీ మంత్రి జోగురామన్న రూ.లక్ష చెక్కును అందజేశారు. అధ్యయన కమిటీ అధ్యక్షుడు, సభ్యుల సమక్షంలో ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు తమ తరఫున చిరుసాయం చేస్తున్నామని చెప్పారు.
రైతుల తరపున కొట్లాడుతాం
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అసెంబ్లీలో కొట్లాడుతం. బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ రైతుల కోసం అమలుచేసిన పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కాంగ్రెస్ 13 నెలల పాలనలో రైతుల బతుకులు ఆగమ్యగోచరంగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ధైర్యంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. రైతులకు మంచి రోజులొస్తాయి.
– అనిల్‌జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
అన్నదాతలు అధైర్యపడవద్దు
రైతులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుభరోసా, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో 408 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదు. బాధిత కుటుంబాలను పరామార్శించడం లేదు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
– మాజీ మంత్రి జోగు రామన్న
పై డబ్బులు కట్టినా మాఫీ కాలేదు
రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేయడానికి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ కమిటీ ముందు రైతులు తమ సమస్యలు విన్నవించారు. రుణమాఫీ విషయంలో రూ.2 లక్షలకుపైగా బ్యాంక్‌లోన్ ఉన్న వారు మిగితా డబ్బులు చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచించిన విధంగా తాము రూ.2 లక్షలకుపైగా ఉన్న డబ్బులు చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు
రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ పర్యటన సందర్భంగా రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను తెలియజేశారు. గుడిహత్నూర్ మండలం నేరడిగొండతండా, బేల మండలం రేణిగూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి, యాపల్‌గూడ గ్రామాల్లో కమిటీ పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించింది. పంట పొలాలను పరిశీలించింది. ఈ సందర్భంగా రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటల కొనుగోళ్లు, కౌలురైతుల సమస్యలు, వ్యవసాయ కూలీలకు ఆర్థికసాయంలాంటి అంశాలను రైతులు కమిటీ సభ్యులకు తెలియజేశారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అమలుచేసిన పథకాలతో సంతోషంగా ఉన్నామని, రెండు పంటలు సాగు చేసి పంటలు సాగు చేసుకున్నామని పలువురు రైతులు వివరించారు. కేసీఆర్ ఉన్నప్పుడు భూమలు ధరలు బాగా పెరిగాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి అధ్వానంగా తయారైందని అభిప్రాయపడ్డారు. రైతు సమస్యల గురించి పట్టించుకునేవారు లేరని, తమ మొర ఎవరికీ చెప్పాలో తెలియడం లేదని కమిటీ దృష్టి తీసుకొచ్చారు. ఆయా రైతుల అభిప్రాయాలను ఓపికగా విన్న సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు.
తెలంగాణ రక్షణకు రైతాంగం శ్రీకారం చుట్టాలి
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాల అమలులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణకు, కాంగ్రెస్ 13 నెలల పాలనలోనే పాత రోజులు వచ్చాయని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రక్షణకు రైతాంగం శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడలో రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కౌలురైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలో రామాయి గ్రామానికి చెందిన ఒక కౌలురైతు ప్రభుత్వం నుంచి సాయం వస్తుందనే ఆశతో ఎకరం భూమికి రూ.31,600 చెల్లించి కౌలుకు తీసుకున్నాడని, తీరా ఇప్పుడు ఆయన నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిర్చి రైతులకు క్వింటాకు రూ.28 వేలు చెల్లించి కొనుగోలు చేస్తే, ఇప్పుడు రూ.12 వేల ధర మాత్రమే వస్తున్నదని తెలిపారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామనడంతో రాష్ట్రంలో రైతులు సన్నబియ్యం పడించారని, తీరా 80% మంది ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచిందని చెప్పారు. వందలో పది మందికే బోనస్ ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వంపై ఆశ కోల్పోయి.. తనువు చాలించిన దేవ్‌రావ్
‘రైతు జాదవ్ దేవ్రావ్కు పంట రుణం రూ.1,96,000 ఉన్నది. రెండు లక్షలలోపు ఉన్న ఈ రుణం మాఫీ అయితదని ఆశ పెట్టుకున్నడు. అది కాకపోవడంతో కుంగిపోయిండు. భార్య జిజియా భాయ్ కిడ్నీ సమస్యకు ఆపరేషన్ చేయించేందుకు భూమిని ఐసీఐసీఐ బ్యాంక్‌లో తనఖాపెట్టి మరో రూ.3.5 లక్షల అప్పు తీసుకున్నడు. రెండు లక్షల రుణ మాఫీ అయితే నిమ్మలంగా ఐసీఐసీఐ లోన్ కట్టుకుందామని ఆశపడ్డడు. ఇటు మాఫీ కాకపోవడం, అటు బ్యాంకోళ్లు ఒకటికి నాలుగుసార్లు అప్పుకట్టాలని అవమానకర రీతిలో బాధపెట్టడం తట్టుకోలేకపోయిండు. పెట్టుకున్న నమ్మకం పోయిందని ఐసీఐసీఐ బ్యాంక్‌కే పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నడు’ అంటూ ఆయన కుటుంబసభ్యులు విలపించారు.
80 వేలు కట్టినా లోన్ రద్దు కాలేదు
ఆదిలాబాద్‌లోని మహారాష్ట్ర బ్యాంకులో రూ.2.8 లక్షల రుణం తీసుకున్న. రూ.2 లక్షల వరకు లోన్ రద్దవుతుందని ఆశపడ్డ. మంత్రులు భట్టి, తుమ్మల రూ.2 లక్షలపైన అప్పు ఉన్న రైతులు మిగితా డబ్బులు బ్యాంకులో చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. దీంతో రూ.80 వేల అప్పు తెచ్చి బ్యాంకులో కట్టిన. అయినా నా లోన్ మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే తమకు తెలియదు అంటున్నరు. వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వం నుంచి మాఫీ కావాల్సి ఉన్నదని చెప్తున్నరు.
– మామిళ్ల ఇస్తారి, రైతు, యాపల్‌గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం
90వేలు అప్పు తెచ్చి కట్టిన..
నాకు ఆదిలాబాద్ మహారాష్ట్ర బ్యాంకులో రూ.2.6 లక్షల అప్పు ఉన్నది. రూ.2 లక్షల కంటే పైన ఉన్న అప్పు కడితే మాఫీ జరుగుతుందని మంత్రులు చెప్పడంతో రూ.90 వేలు బాకీ తీసుకొచ్చి కట్టిన. నాలుగో విడతలోనూ నిరాశ మిగిలింది. పైసలు కట్టినా లోన్ ఎందుకు మాఫీ కాలేదని బ్యాంకు అధికారులను అడిగితే తమకు ఏమీ తెలవదు అంటున్నరు. మా ఊళ్లో చాలమందికి మాఫీ కాలేదు.
– ఆరే నారాయణ, రైతు, యాపల్‌గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం
కాంగ్రెస్ ఏలుబడిలో సాగు కూలబడింది. రైతు ఆత్మహత్యల రుతువు రాష్ర్టాన్ని కమ్ముకున్నది. రోజుకోచోట అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నడు. ప్రభుత్వం వచ్చినంక ప్రాణం తీసుకున్న రైతుల సంఖ్య 409కి చేరింది. ఇదీ ఇప్పుడు తెలంగాణ.
నిన్నటిదాకా దేశానికి అన్నంగిన్నె! నేడు పురుగుమందు డబ్బా!ముఖ్యమంత్రి, మంత్రులు దేశ, విదేశీ టూర్లలో బిజీగా ఉంటే..కూలబడిన సాగుబడిని పట్టించుకునేనాథుడేడి? వ్యథాభరిత రైతుకుటుంబాలకు భరోసా ఇచ్చే దిక్కేది? కాడి వదలేసిన సర్కారు బాధ్యతను బీఆర్ఎస్ భుజానికెత్తుకున్నది. అన్నదాతకు ఆదెరువుగా నిలబడుతున్నది. ఆత్మైస్థెర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నది. ఆత్మహత్యలొద్దని అభ్యర్థిస్తున్నది.
సాగు సంక్షోభాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు కమిటీ క్షేత్ర పర్యటన చేపట్టింది. ఆదిలాబాధ విన్నది. గుండెచెదిరిన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆర్థికంగానూ ఆదుకున్నది. ఆ కమిటీలో కేసీఆర్ కమిట్మెంట్ను చూస్తున్నారు రైతులు.
నాడూ, నేడూ ఏనాడైనా కేసీఆర్ ఆలోచనంతా తమకోసమేనని నమ్ముతున్నారు బాధితులు.మరి, ప్రభుత్వం ఏంచేస్తున్నది? రైతును వదిలి.. ఎగవేతల్ని తలపోస్తున్నది!