సంగారెడ్డి, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): నేటి యువతలో వందకు 90శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనివల్ల ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన టెల్కో, టాటాస్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి కంపెనీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు కోరుకోవటం లేదని పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 20 ఏండ్లలో దేశంలో రోడ్లు వేయాలన్నా చైనా నుంచి ఇంజినీర్లను తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు.
ఐఐఐటీ హైదరాబాద్ అధునాతన ఏఐ, త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ, నానోటెక్నాలజీ, సెమీ కండక్టర్, ఎయిరోస్పేస్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు చేపడుతున్నట్టు వివరించారు. త్వరలోనే 200 కేజీల డ్రోన్‌ను పరీక్షించనున్నట్టు చెప్పారు. డ్రోన్ ఎయిర్ అంబులెన్స్ తయారీపై దృష్టిసారించినట్టు వివరించారు. ఐఐటీ హైదరాబాద్ ఇస్రోతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. త్వరలో స్పేస్ టెక్నాలజీ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్రీడి ప్రింటింగ్‌తో ఐఐటీహెచ్‌లో బ్రిడ్జి నిర్మించామని త్వరలోనే అతిపెద్ద కంపోనెంట్‌ను త్రీడి ప్రింటింగ్‌తో తయారు చేయనున్నట్టు వివరించారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పెంచడంపై శని, ఆదివారం రెండురోజులు ఐఐటీహెచ్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు సోమనాథ్ మాఝి, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.