Musi Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి నివాసముంటున్న ఇల్లునొదిలి వెళ్లిపోతే రూ.25వేల పారితోషికం ఇస్తాం.. అనే ప్రకటన ఎప్పుడైనా విన్నా రా? చూశారా? మూసీ నిర్వాసితులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న దసరా ఆఫర్ ఇది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారికంగా ప్రకటించారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలోని వారు స్వచ్ఛందంగా మరో ప్రాంతానికి తరలివెళ్తే.. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు రూ.25వేల పారితోషికాన్ని ప్రభుత్వం ఇస్తుంది’ అంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు చేపట్టినప్పుడు జరిగే భూసేకరణకు ఒక విధానం ఉంటుంది. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించి వారిని ఒప్పించాలి. కానీ మూసీ విషయంలో రేవంత్ సర్కార్ బల్డోజర్లను మాత్రమే నమ్ముకున్నది. రెడ్ మార్కింగ్ శాస్త్రీయం గా జరుగలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక నిర్వాసితులను రాత్రికి రాత్రి ఇండ్లు ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభు త్వం ఒక ప్రైవేటు కంపెనీలా ఆఫర్లు ప్రకటించిందనే విమర్శలు వస్తున్నాయి. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో మౌలిక వసతులు లేవు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఆ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది.
ఇప్పుడు రాత్రికిరాత్రి నిర్వాసితులకు ఇండ్లు కావా ల్సి ఉండటంతో వారిని అందులోకి పం పుతున్నది. ఒక్కసారి నిర్వాసితులు పట్టా పుచ్చుకొని డబుల్ బెడ్రూం ఇండ్లవైపు కదిలితే.. ఇక సర్కారు తీరు ‘ఓడ మల్ల న్న.. బోడి మల్లన్న’గా తయారవుతుందని పలువురు అనుమానిస్తున్నారు.