హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో పరిశ్రమల ఏర్పాటు అత్యంత దుర్భరంగా మారింది. భూమి కొనుగోలు చేసి పరిశ్రమ పెట్టాలనుకునేవారికి చుక్క లు కనిపిస్తున్నాయి. టీజీఐఐసీ ద్వారా జరిగే భూకేటాయింపులు అర్హతల ఆధారంగా జరగడంలేదనే ఆరోపణలున్నాయి . స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఇలాకాలో తమకు తెలియకుండా ఎవ్వరికీ భూము లు కేటాయించరాదని హుకుం జారీచేస్తున్న ట్టు సమాచారం. దీంతో అధికారులు ఆయా జిల్లాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒక్కసారి చెప్పించుకుంటే పని అయిపోతుందని దరఖాస్తుదారులకు సెలవిస్తున్నారు. బీఆర్ఎస్ హ యాంలో కనిపించని హుకుం జారీలు.. ఇప్పు డు పరిశ్రమ వర్గాలకు షాక్ తెప్పిస్తున్నాయి. పరిశ్రమ పెట్టాలనుకునేవారు ప్రాజెక్టు రిపోర్ట్‌తో ఆన్లైన్లో టీజీఐఐసీకి దరఖాస్తు చేసుకుంటే, వారి అర్హతల ఆధారంగా, వారు కోరుకున్న ఇండస్ట్రియల్ ఏరియాలో భూమి కేటాయించటం ఆనవాయితీ. కానీ, రాష్ట్రంలో కాం గ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థి తి పూర్తిగా మారిపోయింది. ఎవరికైనా భూము లు కేటాయించాలంటే స్థానిక మంత్రి, లేక కాం గ్రెస్ ఎమ్మెల్యే చెప్తేనే భూకేటాయింపు జరుగుతున్నదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.
గత బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి చేసిన మేడ్చల్ సిద్దిపేట జోన్ – వర్గల్, ములుగు, కర్కపట్ల, బండ మైలారం, కర్కపట్ల, తునికి బొల్లారం, బండ మైలారం, బండ తిమ్మాపూర్, మాదారం, కొండాపూర్; సంగారెడ్డి పటాన్చెరు – పాశమైలారం, ఇంద్రకరణ్; రంగారెడ్డి- కొత్తూర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, రాకంచెర్ల, సుల్తాన్పూర్; ఖమ్మం- బుగ్గపాడు; వరంగల్-మదికొండ, టెక్స్టైల్ పార్క్; యాదాద్రి-వెలిమినేడు, దండుమల్కాపూర్ తదితర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూముల కేటాయింపు జరుగుతున్నది. అయితే, వీటిలో భూములు పొందాలంటే అన్ని అర్హతలు ఉన్నా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల అనుమతి లేకుండా భూముల కేటాయింపు జరగటం లేదు. ‘మా ప్రాంతంలో భూములు మేం చెప్పినవాళ్లకే కేటాయించాలి’ అని ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేయగా, ‘మా ప్రాంతంలో మాకు తెలియకుండా ఎవ్వరికీ భూములు కేటాయించినా ఊరుకొనే ప్రసక్తే లేదు’ అని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రారని పరి శ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీఎస్ఐపాస్ వంటి విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని పలు అంతర్జాతీయ కంపెనీలు ప్రశంసించాయి. పారదర్శకంగా భూములు కేటాయించడంతోపాటు సింగిల్ విండో విధానంలో అన్నిరకాల అనుమతులు ఇచ్చేవారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉండటంతో ఏనాడూ భూ కేటాయింపులో ఇబ్బందులు ఎదురు కాలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. తమపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదని, భారీ పెట్టుబడులు ఉన్న కంపెనీలకు క్యాబినెట్ ద్వారా భూకేటాయింపులు జరిగితే, చిన్న కంపెనీలకు ఆన్లైన్ విధానంలో అర్హతలకు అనుగుణంగా కేటాయించేవారమని గుర్తుచేస్తున్నారు.