రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. పాటలు మొదలు ప్రచార చిత్రాలు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ని సృష్టించాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ప్రవేశం కలిగిన ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
ఓ వైపు ‘పెద్ది’ ప్రీరిలీజ్ మానియా కొనసాగుతుండగానే..మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ చేయనున్న తదుపరి సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ రావడంతో తాజా ప్రాజెక్ట్‌పై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.
తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ పుట్టినరోజైన ఈ నెల 27న ఈ సినిమా తాలూకు బిగ్ అప్డేట్ వెలువడనుందట. సినిమా కాన్సెప్ట్‌తో పాటు ప్రీలుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ క్లాస్, మాస్ జోనర్లో రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. మరి వీటిలో ఆయన దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మొత్తానికి రామ్‌చరణ్ బర్త్‌డే రోజున ఈ క్రేజీ ప్రాజెక్ట్ బిగ్ అప్డేట్ ఖాయమని అంటున్నారు.