Irumudi | మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన మొదటి వారం నుంచే మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా, ఇప్పుడు రెండో వారంలోనూ అదే స్థాయి క్రేజ్‌ను కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కొత్త సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ ప్రేక్షకుల ఆదరణను నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా రెండో శనివారం ఈ సినిమా నమోదు చేసిన టికెట్ సేల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
బుక్‌మైషోలో రెండో శనివారం ఒక్కరోజే ఏకంగా 3.76 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సినిమా రెండో వారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు కావడం విశేషంగా మారింది. ఇప్పటివరకు రెండో వారంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక టికెట్ అమ్మకాలు చూస్తే.. 4వ రోజు – సోమవారం: 3.53 లక్షల టికెట్లు, 5వ రోజు – మంగళవారం: 3.54 లక్షల టికెట్లు,6వ రోజు – బుధవారం: 2.43 లక్షల టికెట్లు, 7వ రోజు – గురువారం: 2.09 లక్షల టికెట్లు, 8వ రోజు – శుక్రవారం: 3.34 లక్షల టికెట్లు, 9వ రోజు – రెండో శనివారం: 3.76 లక్షల టికెట్లు. వీకెండ్ ప్రారంభమైన వెంటనే సినిమా సేల్స్ మళ్లీ భారీగా పుంజుకోవడం ‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా రెండో శనివారం వారంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడవడం సినిమాకు ఉన్న బలమైన హోల్డ్‌ను స్పష్టం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’కి మంచి స్పందన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో షోలు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుండగా, వీకెండ్లో కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం సినిమాకు మరింత కలిసివచ్చే అంశంగా మారింది. మొదటి వారంలో భారీ వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం, రెండో వారంలోనూ అదే ఊపును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. రానున్న ఆదివారం కూడా టికెట్ సేల్స్, వసూళ్లు భారీగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.రెండో శనివారం వచ్చిన స్పందనను చూస్తే ఆదివారం ‘ఇరుముడి’ మరింత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వీకెండ్లో కుటుంబ ప్రేక్షకుల రాక పెరగడంతో ఆదివారం కలెక్షన్లు కీలకంగా మారనున్నాయి.