న్యూఢిల్లీ: నేపాల్ వరదల్లో గల్లంతైన వారిలో ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీసెస్ సీఈవో లక్ష్మీనాథ్ గోపిశెట్టి కూడా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ వెల్లడించింది. వ్యక్తిగత పనిపై వెళ్లిన ఆయనను సంప్రదించలేక పోతున్నామని తెలిపింది.
నేపాల్ వరదల్లో చిక్కుకుపోయిన ఒక బాలుడు సమయస్ఫూర్తి చూపించగా, అతడిని అధికారులు రక్షించారు. వరదలకు గురైన ఇంట్లో ఒక బాలుడు చిక్కుకుపోయాడు. అదే సమయంలో హెలికాప్టర్ శబ్దం విన్పించడంతో వెంటనే భవనం పైకి చేరాడు. ఒంటిపై ఉన్న టీషర్ట్ తీసి గాల్లోకి అటూ ఇటూ ఊపి హెలికాప్టర్ సిబ్బంది దృష్టిలో పడ్డాడు. దీంతో అది భవనం సమీపంలోకి వచ్చింది.
అయితే దిగడానికి తగిన ప్రదేశం లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతూ బాలుడికి అతి దగ్గరగా వచ్చింది. సిబ్బంది సూచనలతో ల్యాండింగ్ స్కిడ్ పట్టుకుని బాలుడు హెలికాప్టర్లోకి ఎక్కేశాడు. దీంతో చుట్టుపక్కల వారు కేరింతలు కొట్టారు. మరోవైపు కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న భారతీయ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోవడంతో వారి కోసం నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద సహాయక బృందాలు బురద, భారీ శిథిలాలలను తొలగిస్తూ శ్రమిస్తున్నాయి.