Zee 5 | ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 తెలుగు ప్రేక్షకుల కోసం భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. స్టార్ హీరోల క్రేజీ సినిమాలు, ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌లు, వినూత్నమైన ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్ కంటెంట్‌తో రాబోయే రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు జీ5 సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో జీ5 భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషంగా మారింది.వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి జీ5 భారీ ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. థియేట్రికల్ సినిమాలతో పాటు ప్రత్యేకంగా ఓటీటీ కోసం రూపొందించే ఒరిజినల్ కంటెంట్‌పైనా సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
జీ5 మెగా లైనప్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK111’ కూడా చోటు దక్కించుకుంది. బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కూడా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన ప్రస్తావనతో లైనప్‌లో చోటు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ కూడా జీ5లోకి రానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం కూడా ఈ భారీ లైనప్‌లో ఉండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
అల్లరి నరేష్ నటిస్తున్న ‘కనక దుర్గ’ తో పాటు ఇతర క్రేజీ చిత్రాలు కూడా జీ5 వేదికగా ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు కంటెంట్‌తో పాటు ఇతర భాషల్లో మంచి ఆదరణ పొందిన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు జీ5 ప్లాన్ చేస్తోంది. ‘డిమాంటీ కాలనీ 2’, ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి చిత్రాలు కూడా ఈ కంటెంట్ లైనప్‌లో ఉన్నాయి.విభిన్న జానర్లకు చెందిన సినిమాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని జీ5 భావిస్తోంది.జీ5 ప్రకటించిన కొత్త ఒరిజినల్ ప్రాజెక్ట్‌లలో ‘శ్రీమతి’ ఒకటి. నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. మరోవైపు భరత్ నివాస్, శివాజీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పంచనామా’ కూడా జీ5 ఒరిజినల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా రాబోతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ కూడా జీ5 లైనప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తొలి సీజన్‌కు లభించిన ఆదరణ నేపథ్యంలో రెండో సీజన్‌పై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ఏఐ టెక్నాలజీ ఆధారంగా రూపొందించే కథనాలపై కూడా జీ5 దృష్టి సారించింది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్ ప్రాజెక్ట్‌లు కూడా త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.పిల్లల కోసం ప్రత్యేకంగా యానిమేషన్ కంటెంట్‌ను కూడా అందించనున్నట్లు జీ5 వెల్లడించింది. సినిమాలు, సిరీస్‌లతో పాటు క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు జీ5 లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను కూడా అందించనుంది. ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్టీ20 వంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.