Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ విజయానంతరం వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే త్రివిక్రమ్, వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో ఈసారి ఎలాంటి వినోదాన్ని అందించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో చిత్రంపై బజ్ మరింత పెరిగింది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం, వెంకటేష్ ఎనర్జీ కలగలిసి సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఫ్యామిలీ ట్రీట్ ఇవ్వబోతోందని అభిమానులు భావిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్రబృందం మరికొంత సమయం తీసుకుంటోందట.దీంతో సినిమాను ఒకటి లేదా రెండు వారాలు వాయిదా వేసే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కొత్త విడుదల తేదీగా అక్టోబర్ 9 లేదా అక్టోబర్ 16ను పరిశీలిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
దసరా సీజన్లో వరుసగా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’, మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, విజయ్ దేవరకొండ ‘రణబలి’ వంటి భారీ ప్రాజెక్టులు కూడా విడుదల రేసులో ఉండటంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన రిలీజ్ డేట్ ఎంచుకోవడం చాలా కీలకంగా మారింది. భారీ సినిమాల మధ్య క్లాష్ ఏర్పడితే స్క్రీన్ల పంపిణీతో పాటు కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో, ‘ఆదర్శ కుటుంబం’ టీమ్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.