జడ్చర్ల టౌన్/మూసాపేట/భూత్పూరు, మార్చి 14 : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిరు వ్యాపారస్తులపై గ్యాస్ బాంబులు పడుతున్నాయి. సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంతో అధిక ధర చెల్లించాల్సి వస్తుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులుతీరుతున్నారు. ఖాళీ సిలిండర్లను బైక్‌లు, ఆటోల్లో పెట్టుకొని ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసినా డెలివరీకి నాలుగైదు రోజులుపడ్తుందని కస్టమర్లు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ నిర్వాహకుల నిర్వాకంతో రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని ఆగ్రహం చెందుతున్నారు.
జడ్చర్లలో మాత్రం సర్వర్ సమస్య ఉందంటూ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో గ్యాస్ కోసం నిరీక్షిస్తున్నారు. గోదాంలో నిల్వలు ఉన్నా.. బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు స్టాక్ లేదంటూ కొందరు చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నా కొందరు బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకుగానూ స్టాక్ లేదంటూ చెప్పుకొస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. భూత్పూరు గ్యాస్ ఏజెన్సీ వద్ద నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది. భూత్పూర్ చౌరస్తాలో నిత్యం రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు గ్యాస్ కొరతతో శనివారం మూత పడ్డాయి.
చిరు వ్యాపారస్తులకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. పొయ్యి మండితే కానీ నడవని కుటుంబాలు ఎన్నో చిన్నచిన్న వ్యాపారాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పాత రోజులు మళ్లా వచ్చాయని పలువురు ఆరోపిస్తున్నారు. మళ్లా కట్టెల పొయ్యిలపై వంటలు చేసే రోజులు వచ్చాయంటున్నారు. ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో ట్రబుల్ ఎక్కువగా ఉంది.
పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సిలిండర్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు అల్పాహారం.. భోజనం, స్నాక్స్ అందించేందుకుగానూ సిలిండర్లపైనే వంటలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సంక్షోభం ఉండడంతో ఎలా చేయాలో అంటూ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ నిత్యం బాలింతలు, గర్బిణులు, చిన్నారులకు భోజనం వండాల్సి ఉంది.. ప్రస్తుత వినియోగిస్తున్న సిలిండర్లు ఖాళీ అయితే పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాల్సిన సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే శనివారం నారాయణపేట, వనపర్తిలో అక్రమంగా గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను హోటళ్లలో వాడుతుంటే అధికారులు పట్టుకున్నారు.
వంట గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవటంతో పలు ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో కట్టెల పొయ్యిల మీద వంట వండుతున్నారు. జడ్చర్లలో హైవే-44 ఉండడంతో ఇక్కడ ఉన్న దాబాలు, హోటళ్లకు నిత్యం గిరాకీ ఉంటుంది. టిఫిన్లు, భోజనం కోసం వాహనదారులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆగుతుంటారు. ఒక్క హోటల్‌కు కనీసం 5 నుంచి 10 సిలిండర్లు అవసరం ఉంటాయి. అయితే వంట వండటానికి కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా ఉండడంతో కట్టెల పొయ్యిల మీద వంటలు చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు వాపోతున్నారు.
అయితే అక్కడక్కడ బ్లాక్‌లో సిలిండర్ దొరుకుతున్నా.. అంత ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి టిఫిన్ సెంటర్లు నడపలేమంటూ మరికొందరు చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మూసాపేట మండలం సంకలమద్ది వద్ద హైవే-44పై లక్ష్మమ్మ, ఆమె కూతురు చిన్నపాటి చాయ్, బజ్జీ హోటల్ నిర్వహిస్తున్నారు. గ్యాస్ కొరతతో చేసేది లేక కట్టెల పొయ్యిపై వండుతున్నారు.