ఖలీల్‌వాడి, అక్టోబర్ 4: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్వహంగులతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆహ్లాదాన్ని పంచే విధంగా కలెక్టరేట్ ఆవరణలో విస్తృతంగా చెట్లను పెంచారు. ఈ నెల 3న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం కలెక్టరేట్లోని పచ్చని చెట్లను నరికివేశారు. కలెక్టరేట్‌కు విద్యుత్తు సరఫరా చేసే స్తంభాలు, తీగలను ధ్వంసం చేశారు.
ఈ నెల 2 నుంచి బుధవారం వరకు విద్యుత్తు సరఫరాలేక కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు పునరుద్ధరణ పనులు బుధవారం రాత్రి వరకు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. చీకట్లోనే కలెక్టరేట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యమైన విభాగాల్లో జనరేటర్ సహాయంతో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. పచ్చని గార్డెన్లో హెలిప్యాడ్ కోసం బీటీ రోడ్డు వేయడంపై కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు మండిపడుతున్నారు.