వేములవాడ, అక్టోబర్ 14: ‘అయ్యా.. సీఎం రేవంత్రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి. మీ మీద పో రాటం చేసే వయసు కూడా లేదు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు, రిటైర్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు జనపాల వెంకటయ్య ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఆయన గతేడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందారు.
14 నెలలు అవుతున్నా రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్రంలో పదివేల ఐదు వందల మంది ఉన్నారని చెప్పారు. ఇటీవలే సత్యనారాయణ అనే ఉద్యోగి తనకు రావాల్సిన బకాయిలకోసం ఎదురుచూసి ప్రాణం తీసుకున్నాడని గుర్తుచేశారు. మరో ఉద్యోగి బకాయిల కోసం వేచి చూసి ఇంటి నుంచే పారిపోయినట్టుగా వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బాధ్యతగా పనిచేసిన తమకు రావాల్సిన బకాయిలు ప్రాణాలు పోకముందే అందించి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. 62 ఏండ్ల వయసు వచ్చాక వచ్చే నగదు కోసం ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేసే సత్తువ లేకపోగా తిరిగే ఓపిక కూడా లేదని ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే తమ బకాయిలు విడుదల చేయాలని రెండు చేతులు జోడించి వేడుకున్నారు.