Telangana | న్యూస్‌నెట్‌వర్క్, జూలై 20 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండురోజులుగా రాష్ర్టాన్ని ముసురు వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. జగిత్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఆరెం జ్ అలర్ట్ జారీ చేసిందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముసురుకు జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇండ్లు నేలమట్టమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి సమీపంలోని వాగు ఉధృతం గా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామంలోని ఇద్దరు గర్భిణులు పులిశె అనూష, దబ్బగట్ల శైలజను బోటు ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.
కొండా యిలో ఫిట్స్‌కు గురైన వృద్ధురాలిని ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో దొడ్లవాగు ఒడ్డుకు చేర్చి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల జోరు వాన కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు లోతట్టు ప్రాం తాలను ముంచెత్తుతున్నాయి. పంటలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోగా, రోడ్లు కోతకు గురయ్యా యి. ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామం రెండు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగడంతో లంబాడీతండా, ఖర్జీ, కోనంపేట గ్రామాల ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతున్నది. ప్రాణహిత నది నిండుగా ప్రవహిస్తున్నది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వాన కురిసింది.
గోదావరి వరదల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం సచివాలయం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా జిల్లాల కలెక్టర్లతోపాటు సొంత జిల్లా ములుగు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వరద పరిస్థితులపై సమీక్షించారు.
భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండటంపై గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. విద్యుత్తు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అలంపూర్, జూలై 20: మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాఠశాల ఆవరణ చిత్తడి చిత్తడిగా మారిందని, పాఠశాలలోకి విద్యార్థులు ఎలా వెళ్లాలని వారి తల్లిదండ్రులు శనివారం ఆందోళకు దిగారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల ఆవరణ బురదమయంగా మారింది. మైదానం మొత్తం వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు బురదలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. బడి ఆవరణలో మట్టిపోసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.