KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అతి ప్రవర్తనతో మంచి నీళ్ల కోసం ప్రజలు మళ్లీ బిందెలు మోయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో మిషన్ భగీరథ పథకం పెట్టి అద్భుతంగా తాగు నీటి సరఫరా చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అతి తెలివికిపోయి విద్యుత్ వ్యవస్థనే కాకుండా తాగునీటి సరఫరా వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. తొమ్మిదేళ్లు వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎక్కడికి పోయినయని ఆయన ప్రశ్నించారు.
‘తెలంగాణలో కేవలం మూడు నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకుల అతి ప్రవర్తనవల్ల మళ్లీ బిందెలు వచ్చినయ్. తాగునీటి కోసం ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనలవి కాదు. ప్రజలు దూరం ప్రాంతం నుంచి బిందెలు మోస్తున్నరు. మిషన్ భగీరథకు ముందు నల్లగొండలో ఫ్లోరైడ్‌తో, గిరిజన ప్రాంతాల్లో కలుషిత తాగునీటితో జనం చనిపోయేవాళ్లు. ఈ పరిస్థితిని చూడలేక మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీటి సరఫరా చేసినం. పినపాక నియోజకవర్గంలోని కీకారణ్యంలోగల దొంగతోపు అనే చిన్న ఊరుకు కూడా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసినం. ప్రజలు బ్రహ్మాండంగా అనుభవించిండ్రు’ అని కేసీఆర్ చెప్పారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసొచ్చిన అంశం ఏందంటే ఇటీవల ప్రధానమంత్రి 1,600 మెగా వాట్ల ఎన్టీపీసీ తొలి దశను జాతికి అంకితం చేశారు. మునుపటికంటే 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినా వీళ్లు కరెంటు సరఫరా సరిగా చేయలేకపోయారు. కరెంటు సరఫరాలో వీళ్లు ఎందుకు ఫెయిలయ్యిండ్రో నాకు అర్థం కావడంలేదు. తొమ్మిదేళ్లు వచ్చిన మంచి నీళ్లు ఎక్కడికి పోయినయో తెలుస్తలేదు. ఇంత దారుణం ఏంది..? మళ్ల ట్యాంకర్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏంది..? నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హైదరాబాద్‌లో 2.50 లక్షల ట్యాంకర్ల తాగునీటిని ప్రజలు కొనుగోలు చేశారు. మరి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది..? దీనిపై ప్రజల్లో వచ్చిన ఆగ్రహానికి వీళ్లు (కాంగ్రెస్) బలికాక తప్పదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.