
మహబూబ్‌నగర్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రైతుల గౌరవం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బంధు సంబురాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తెలిపారు. రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.50 వేల కోట్లు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని రైతుబంధు సంబురాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు రైతుబంధు సంబురాలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ఏ మార్కెట్, గోదాములో చూసినా ధాన్యం రాశులు రాశులుగా ఉంటున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 50 ఎకరాలు ఉన్న రైతుకు కూడా గౌరవం ఉండేది కాదని, ప్రస్తుతం 5 ఎకరాలు ఉన్నవారికి కూడా గౌరవం ఇస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులలో గౌరవం, విశ్వాసం, భరోసా పెరిగిందని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించిందని, ప్రత్యేకించి రైతుల కోసం ప్రతి మండలానికి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం రైతుబంధు కింద 2,9,607 మంది రైతులకు 228 కోట్ల 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి కి జాతీయ హోదా కల్పించాలన్నారు.2014 కు ముందు, 2014 తర్వాత రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై గ్రామ గ్రామాల వారీగా తెలియజేయాలని, ప్రతి గ్రామంలో ఒక బోర్డును ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డిసిసిబి ఉపాధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, డిఏఓ సుచరిత పాల్గొన్నారు.