సంగారెడ్డి : గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలుచోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడి పంట పొలాలను ముంచెత్తాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా(Sangareddy) సింగూరు ఎడమ కాలువకు (Singuru left canal) గండి పడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో వరద ఉధృతికి సింగూర్ కెనాల్ ఎడమ కాల్వ తెగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాలువ దెబ్బతిని తెగినట్లు స్థానికులు చెబుతున్నారు.
కాలువ కెనాల్ తెగిపోవడంతో పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో బాధిత రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువ మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.