Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోవడంతో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 25,500 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 38 వేల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లో వరద ప్రవాహాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.35 లక్షల క్యూసెక్కులు, లక్ష్మీబరాజ్‌కు 3.34 లక్షల క్యూసెక్కులు, రాజరాజేశ్వర జలాశయానికి 10 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు 11,507.52 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఐదు క్రస్టు గేట్ల ద్వారా 9,682.84 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మల్లన్నసాగర్‌కు కాళేశ్వర జలాలు
సిద్దిపేట, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బహుళ ప్రయోజనాలు కలిగిన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నసాగర్‌కు కాళేశ్వర జలాలు తరలివస్తున్నాయి. బుధవారం 4 పంపులతో మల్లన్నసాగర్‌లోకి నీటిని ఎత్తిపోయడం అధికారులు ప్రారంభించారు. ఒక్కో పం పు నుంచి 1,300 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ఒక్క రోజులో ఏకధాటిగా నడిస్తే నాలుగు పంపులకు 0.4 టీఎంసీల నీళ్లు వస్తాయి. గురువారం రంగనాయక సాగర్‌లోకి ఒక పంపు ద్వారా 6 గంటలపాటు నీటిని ఎత్తిపోసిన తర్వాత పంప్‌ను బంద్ చేసినట్టు తెలిపారు. 50 టీఎంసీల సామ ర్ధ్య ఉన్న మల్లన్నసాగర్‌ను దశలవారీగా నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్ర స్తుతం 10 రోజులు పంపులు నడిపి 15 నుంచి 16 టీఎంసీల వరకు నీటిని నింపాలని నిర్ణయించినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ వేణు తెలిపారు.