హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): సమావేశానికి రాలేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా లేఖరాస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి అదేదో అస్కార్, నోబెల్ అవార్డులా చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం పార్టీ నేతలు శుభప్రద్ పటేల్, రాజేశ్‌నాయక్, గౌతమ్ప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. సోనియాను గతంలో దెయ్యం అన్నందుకు అవార్డు ఇచ్చారా? లేదంటే బీసీ రిజర్వేషన్లు పెంచినందుకు అవార్డు ఇచ్చారా..? అనేది ఆయనే చెప్పాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ అస్తిత్వంపై రేవంత్ దాడిచేస్తున్నా, గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నా కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఏర్పడిన తెలంగాణలో సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఏపీకి నీళ్లు, ఢిల్లీకి నిధులు, తెలంగాణ వ్యతిరేకులకు నియామకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్, ఆంజనేయరెడ్డి, శ్రీరామ్ కర్రీ వంటి వారిని సలహాదారులుగా తీసుకుని, రాష్ట్ర సొమ్మును దోచిపెడుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు తెలంగాణలో కాంట్రాక్టు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. ఓటుకు నోటు సాంలో ముద్దాయిగా ఉన్న ఉదయసింహ ఏ హోదాలో అధికార సమీక్షల్లో పాల్గొంటున్నారని నిలదీశారు. కాంగ్రెస్‌కు బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి లేదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మొదట్నుంచీ తప్పుల తడకగా ఉన్నాయని, కులగణన నుంచి బీసీ బిల్లు వరకు ప్రభుత్వం ఏనాడూ శాస్త్రీయంగా ముందుకు పోలేదని మండిపడ్డారు. ఇప్పటికీ బీసీ రిజర్వేషన్లపై ప్రధానిని కలవలేదని చెప్పారు. పార్టీలపరంగా రిజర్వేషన్లకు రేవంత్ పావులు కదుపుతున్నారని మండిపడ్డారు.