Kotha Prabhakar Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వస్తున్న వదంతులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల, వారి పనివేళల్లో మార్పుల పట్ల రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీని కలిశానని ఆయన తెలిపారు. ఇదే విషయమై ముఖ్యమంత్రిని కలిశానని వివరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ప్రోటోకాల్ విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదని ఆయనకు తెలియజేశామని తెలిపారు. అనవసరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా తమపై బురద జల్లడం కంటే ప్రజా సేవలతో తమతో కలిసి రావాలని ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు.