హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరికీ వినతిపత్రాలు ఇవ్వాలని సంఘం పిలుపునిచ్చింది. టెట్ అర్హత నుంచి టీచర్లను మినహాయించాలని డీటీఎఫ్ డిమాండ్ చేసింది.
టెట్ సిలబస్ అశాస్త్రీయంగా ఉందని సంఘం ఆక్షేపించింది. ఈ పరీక్ష అర్హత మార్కులను తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీలకు 35, బీసీలకు 40, ఓసీలకు 50శాతం కనీస అర్హత మార్కులుగా పరిగణించాలని కోరింది. ఇన్ సర్వీస్ టీచర్లకు వేసవిలో స్పెషల్ టెట్ నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ స్టేట్(ఆర్‌యూపీపీ టీఎస్) డిమాండ్ చేసింది. పదో తరగతి స్పెషల్‌క్లాసులు నడుస్తున్నందున టీచర్ల కోసం వేసవి సెలవుల్లో టెట్ నిర్వహించాలని కోరింది.