హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ)/సిటీ బ్యూరో/ఖైరతాబాద్: డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థుల పోరుబాట ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ (డీఎస్ఈ) కార్యాలయాలన్ని ముట్టడించారు. పోలీసుల ముళ్ల కంచెలను దాటుకుంటూ పెద్ద సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు గేటు పైనుంచి దూకేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, అభ్యర్థుల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వ మొండివైఖరిపై నిరుద్యోగ అభ్యర్థులు ధ్వజమెత్తారు.
పరీక్షల గడువు సమీపిస్తున్నా, తమ వినతిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కారుపై అభ్యర్థులు దుమ్మెత్తిపోశారు. దఫా దఫాలుగా వచ్చిన అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కు లు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. నిరుద్యోగులు విడతల వారీగా ముట్టడికి తరలిరావ డం, పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతం లో ఉద్రిక్త వాతవరణం నెలకొన్నది. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు అత్యుత్సాహంతో అనుచితంగా ప్రవర్తించారు.కొందరు పోలీసులు వారిపై దౌర్జన్యంగా వ్యవహారించారు. ఇష్టారీతిన ఈడ్చుకెళ్తూ వ్యాన్లలో నెట్టిపడేశారు. మహిళా అభ్యర్థులపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సమయంలో పోలీసులు నిరంకుశ వైఖరిపై డీఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. అంతా ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వచ్చి డీఎస్ఈని ముట్టడించారు. తొలుత నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ తన అనుచరులతో కలిసి డీఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టుచేశారు.
బృందాలుగా దూసుకొచ్చిన అభ్యర్థులు
ఏజీ ఆఫీస్ జంక్షన్ వైపు నుంచి, లక్డీకాపూల్ రాజ్‌దూత్ జంక్షన్ నుంచి అభ్యర్థులు బృందాలుగా డీఎస్ఈ వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నిరుద్యోగులకు మద్దతుగా నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా వచ్చి డీఎస్ఈ ముట్టడిలో పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ నేతలు నిరుద్యోగులకు మద్దతుగా డీఎస్ఈని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. టెట్, టీజీపీఎస్సీ నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల వెంటే డీఎస్సీ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నించారు. 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఎలా అంటారని, ఇది దగా డీఎస్సీ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్సీ పరీక్షలను వాయిదావేసే వరకు పోరాడుతామని వారంతా స్పష్టంచేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్ డౌన్, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. అంటూ నిరుద్యో గ యువత నినాదాలు చేసింది.
‘వయనాడ్‌లో ప్రచారం చేస్తాం’
నిరుద్యోగులతో పెట్టుకుంటే లాగులూడగొట్టి తమ సత్తా చాటుతామని ముట్టడి సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని తేల్చిచెప్పారు. మాకు ఐదేండ్లు అధికారాన్నిచ్చారు.. ఏం ఢోకా లేదని సీఎం రేవంత్‌రెడ్డి ధీమాగా ఉన్నాడేమో.. మేం ఢిల్లీకి వెళ్తాం.. వయనాడ్‌లో ప్రియాంకగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం.. అని హెచ్చరించా రు. రాష్ట్రంలో త్వరలో జరిగే గ్రామ పంచాయతీ, ఇతర స్థానికసంస్థల ఎన్నికల్లోనూ తమ ప్రతాపం చూపుతామని స్పష్టంచేశారు.
పోలీసుల కాళ్లుమొక్కిన అభ్యర్థి
నిరుద్యోగుల డీఎస్ఈ ముట్టడిని పోలీసు లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఓ అభ్యర్థి తమకు నిరసన తెలిపేందుకైనా అవకాశం ఇవ్వండి.. అంటూ పోలీసు అధికారుల కాళ్లపై పడి మొక్కాడు. ‘సార్.. మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం.. మేమెలాంటి అరాచకాలకు పాల్పడటం లేదు.. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.. ఇప్పుడున్న కాంగ్రె స్ కంటే గత బీఆర్ఎస్ సర్కారే బెటర్‌గా ఉండే’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. మరో అభ్యర్థి చేతులు జోడించి పోలీసులను మొక్కుతూ సార్ మమ్మల్ని ఆరెస్టు చేయకండి.. అంటూ పోలీసులను వేడుకున్నాడు. నిరుద్యోగుల తరఫున గతంలో ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్ నేడు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని అభ్యర్థులు ధ్వజమెత్తారు.
అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన అర్థరాత్రి దాటాక కూడా కొనసాగుతున్నది. తొలుత సిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణకు, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి మారింది. సోమవారం తొలుత విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయ ముట్టడితో అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. గోషామహల్, పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వు (కార్) హెడ్‌క్వార్టర్స్, ముషీరాబాద్, గాంధీనగర్ ఠాణాలకు తరలించారు. సాయంత్రానికి నిరసనకారులను ఇండ్లకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. అదే సమయంలో డీఎస్సీ పరీక్షలను ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో భగ్గుమన్న డీఎస్సీ అభ్యర్థులు తమ నిరసనను కొనసాగించేందుకే నిర్ణయించారు. అప్పటికప్పుడే కార్ హెడ్‌క్వార్టర్స్ మైదానంలో ఉన్న సుమారు 300 మందికిపైగా నిరుద్యోగ యువత.. ప్రభుత్వం దిగివచ్చే వరకు అక్కడే ఉండి ఆందోళన చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా కార్ హెడ్‌క్వార్టర్స్ మైదానంలో ఉన్న లైట్లన్నింటికీ అధికారులు విద్యుత్తు సరఫరాను నిలపేశారు. కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేకుండా చేశారు. అయినా డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనను కొనసాగించారు. మహిళలున్నారనే సోయి పోలీసులకు లేకపోవడంపై డీఎస్సీ అభ్యర్థులు మండిపడ్డారు. నిరుద్యోగ యువత కార్ హెడ్‌క్వార్టర్స్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేవైఎం ఇతర నాయకులు అక్కడకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు. ఆందోళనకారులకు మంచినీరు, ఆహారం అందించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. కార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసులు ఇబ్బందులకు గురిచేయడంతో నిరుద్యోగ యువకులు నిరసన శిబిరాన్ని అర్థరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణకు మార్చారు. వారంతా ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. డీఎస్సీ వాయిదాపడే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సర్కారే బాగుండె!
‘సార్.. కొలువుల కోసం మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నం. మేంఎలాంటి అరాచకాలకు పాల్పడటం లేదు. మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నం. ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండె!.. ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలె’
– నిరసనను అడ్డుకున్న పోలీసుల కాళ్లపై పడి ఓ నిరుద్యోగి ఆవేదన
ఏపీకున్న సోయి మన సర్కారుకు లేదా?
అప్పట్లో టెట్ రాయండి అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. టెట్ రా శాం. తీరా వెంటనే డీఎస్సీ పెట్టారు. మాపై సవతి తల్లి ప్రేమను చూపించొద్దు. మన పక్కనున్న ఏపీలో టెట్‌కు 90, డీఎస్సీకి 90 రోజులపాటు ప్రిపరేషన్‌కు గడువు ఇచ్చారు. ఈ సోయి కూడా మన ప్రభుత్వానికి లేకుండాపోయింది.
– కృష్ణ, మహబూబ్‌నగర్ మాది కొడంగల్..
ఓటేసి బాధపడుతున్నం
మాది కొడంగ ల్ నియోజకవర్గం.కాం గ్రెస్ గ్యారెంటీలను నమ్మి ఓటేశాం. ఆ పార్టీకి ఎందుకు ఓటేశామా? అని బాధపడుతున్నం. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పరిస్థితి తెచ్చుకున్నది. డీఎస్సీని వాయిదా వేస్తున్నట్టు సీఎం కార్యాలయం నుంచే స్పష్టమైన ప్రకటన రావాలి.
– శ్రీనివాస్, కొడంగల్
తెచ్చుకున్న ప్రభుత్వమే రోడ్డుమీదికి తెచ్చింది
నిరుద్యోగుల వల్లనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. మేం తెచ్చుకున్న ప్రభుత్వమే మమల్ని రోడ్డుమీదికి తెచ్చింది. మా పరిస్థితిని అర్థం చేసుకొని డీఎస్సీ పరీక్షలను 90 రోజులు వాయిదావేయాలి.
– స్వప్న, మహబూబ్‌నగర్
ఆవేదన అర్థం కాలేదా?
ఈ ప్రభుత్వానికి 2.7 లక్షల మంది అభ్యర్థుల ఆవేదన అర్థం కావడం లేదా? మెజార్టీ అభ్యర్థుల అభిప్రాయం తెలుసుకోండి. జాబ్ క్యాలెండర్ అంటూ పక్కదారి పట్టిస్తున్నారు. డీఎస్సీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించండి.
– శ్రీదేవి, హైదరాబాద్