ఖమ్మం వ్యవసాయం, జనవరి 30 : ఖమ్మం మార్కెట్లో ఎర్ర బంగారం (తేజా రకం) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్కు మిర్చిని తీసుకొస్తున్నారు. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి సైతం రైతులు పంటను తెస్తున్నారు. నిరుడు మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయి ధర పలుకడంతో రైతులు ఈ ఏడాది భారీగా సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చేసరికి జాతీయ, అంతర్జాతీయ మా ర్కెట్ల ప్రభావమో, ఖమ్మం ఏఎంసీ మార్కెట్ మా యాజాలమో తెలియదు కానీ పదిరోజుల నుంచి ధర తగ్గుకుంటూ వస్తున్నది.
గత ఏడాది తాలు రకం పంటకు ఇదే మార్కెట్లో క్వింటాల్ రూ.14 వేలు వరకు పలికింది. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయ్యి ప్రస్తుతం ఇదే మార్కెట్లో జెండాపాటలో నాణ్యమైన పంటకు గరిష్ఠ ధర క్వింటాల్ రూ.14 వేలకు చేరి రైతులను మరింత ఆందోళనకు గురిచేసింది. గు రువారం జెండాపాట సమయానికి రైతులు రికార్డు స్థాయిలో 50 వేల బస్తాలను యార్డుకు తీసుకురావడంతో మిర్చి యార్డు ఎర్ర బంగారంతో కళకళలాడింది. కొద్దిసేపటికే జెండాపాట తరువాత ఆశించిన ధర రాకపోవడంతో రైతుల ముఖాలు వాడిపోయాయి. కంట్లో ఒత్తులు పెట్టుకొని పంటను సాగు చేసిన రైతులు మార్కెట్లో పలుకుతున్న ధరను చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.