Drugs | హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్ వర్క్ ను తెలంగాలో ముంబై పోలీసులు ఛేదించారు. మిరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు ఈ భారీ మాదకద్రవ్య ముఠాను అరెస్ట్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో నడుస్తున్న రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా, ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తున్న ఈ ముఠా నుంచి సుమారు రూ. 12,000 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారు:
ప్రాథమిక దర్యాప్తులోనే ఓ విదేశీయుడు సహా 12 మంది అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీ, రూ. 25 లక్షల నగదు స్వాధీనం చేశారు. నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాఠే ఉన్నారు.
ఆపరేషన్ వివరాలు:
పోలీసులు ఈ ముఠాలోకి తమ గూఢచారులను చొరబెట్టారు. వారాల తరబడి ప్రమాదకర ఆపరేషన్ చేసిన అనంతరం, ముఠా మూలాలను గుర్తించి ఫ్యాక్టరీపై దాడి చేశారు. దాడిలో అత్యాధునిక రసాయన పరికరాలు, డ్రగ్ ఉత్పత్తి యూనిట్లు, 32,000 లీటర్లకు పైగా ప్రికర్సర్ కెమికల్స్ కూడా స్వాధీనం అయ్యాయి.
ముఠా కార్యకలాపాలు:
ఈ ఫ్యాక్టరీకి ‘వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ పేరుతో లైసెన్స్ ఉన్నప్పటికీ, లోపల పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల తయారీ జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి చేసిన ఎండీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది.