హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్టు చేసింది. అతడి వద్ద రూ. 3.71 కోట్ల నగదు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నది. దోమలగూడకు చెందిన ఆశిష్ జైన్.. జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో డ్రగ్స్‌ను ఔషధాల రూపంలో సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందటంతో అతడి ఇంటిపై దాడి చేశామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటూ నిషేధిత ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్ఫాజోలాం, డయాజెపమ్, లోరాజెపమ్, క్లోనజెపమ్, జోల్ఫిడమ్, ట్రమొడాల్ వంటి ఔషధాలను ఆర్డర్లపై పంపుతున్నాడని వెల్లడించారు. ఆర్డర్ కోసం డబ్బు అందగానే, అత్యవసర ఔషధాల పేరుతో వీటిని కొరియర్ సంస్థల ద్వారా పంపుతున్నాడని వివరించారు. రెండేండ్లలో అతడు వెయ్యికి పైగా కొరియర్లు చేసినట్టు తేలిందని పేర్కొన్నారు.