గంగాధర, అక్టోబర్ 8: గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులపై మత్తు మందు చల్లి చోరీకి (Chain Snatching) పాల్పడ్డారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందగా, వృద్ధురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర (Gangadhara) మండలంలో కలకలం రేపిం ది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య(75) చేనేత కార్మికుడిగా పని చేస్తుండగా, అతని భార్య లక్ష్మి(70) బీడీ కార్మికురాలిగా పని చేస్తున్నది. వీరికి పిల్లలు లేరు. మంగళవారం సాయంత్రం శంకరయ్య తన ఇంటి ముందు వాటర్ ట్యాంకు వద్ద స్పృహ తప్పి పడి ఉన్న విషయాన్ని ఇంటి పక్క న ఉన్నవారు గమనించారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా, అతని భార్య లక్ష్మి సైతం అదే స్థితిలో కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు చల్లి, వృద్ధురాలి మెడలో మంగళసూత్రం ఎత్తుకెళ్లినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. శంకరయ్య వాటర్ ట్యాంకు వద్ద పడిపోయి ఉండటంతో ఉదయమే మత్తుమందు చల్లి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సాయంత్రం 7 గంట ల వరకు కూడా వృద్ధులు స్పృహలోకి రాకపోవడంతో పోలీసులు వచ్చి అంబులెన్స్‌లో కరీంనగర్ సివిల్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య బుధవారం మృతి చెందినట్టు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 8: ప్రభు త్వం నుంచి రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని బెస్ట్ అవైలబుల్ పథకం విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వామపక్ష విద్యార్థి సంఘా ల నాయకులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా సీపీఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుడు కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 8 ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు వెయ్యి మందికిపైగా దళిత విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా చదువుతున్నారని తెలిపారు. దళిత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.