Harish Rao | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారని హరీశ్‌రావు తెలిపారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు బయట దళారులకు రూ. 1600-1700లకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు.
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
– మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే… pic.twitter.com/MJaE9GAAfx
— Office of Harish Rao (@HarishRaoOffice) March 21, 2026
మన ప్రాంతంలో సన్‌ఫ్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారని.. దానికి కూడా ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించామని హరీశ్‌రావు తెలిపారు. సన్‌ఫ్లవర్‌కు క్వింటాల్‌కు రూ. 7721 మద్దతు ధర ఉందని.. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలని సూచించారు. సన్‌ఫ్లవర్ తక్కువ కాలంలో పూర్తయ్యే పంట.. దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తుందని అన్నారు. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుందంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సాగు కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని అది పదింతలు పెరిగి ఏకంగా 80 వేల ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతోందని తెలిపారు. 2005వ సంవత్సరంలో కరువు వచ్చిన పరిస్థితులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయన్నారు. తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక అల్లాడిపోయామని పేర్కొన్నారు. పశువులను బతికించుకోవడానికి చిన్నకోడూరు, రాజగోపాల్‌పేట, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి ఆంధ్రా నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సప్లై చేశామని గుర్తుచేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదని తెలిపారు. వానలు పడినా, పడకపోయినా కాలంతో సంబంధం లేకుండా రైతులు రెండు పంటలు పండిస్తూ బంగారం లాంటి దిగుబడులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కరువుతో అల్లాడిన మన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు మన ప్రాంత రూపురేఖలను మార్చేసి, వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పూర్తిస్థాయిలో పొందాలని సూచించారు.