చండూరు, జనవరి 22 : నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలు మితిమీరుతున్నాయి. మండలానికి చెందిన కార్యకర్తలు గత మూడు రోజులుగా మద్యం తాగి..ఎమ్మెల్యే ఫొటోతో పాటు మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్పియో వాహనంలో చండూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం స్కార్పియో కారు అతివేగంగా స్థానిక యూనియన్ బ్యాంకు ముందు నుంచి దూసుకెళ్తూ వెనుకాలే ఉన్న స్వర్ణ వైన్స్ గేటును ఢీకొని లోపలికి వెళ్లింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.
‘మిమ్మల్ని ఇక్కడ వైన్స్ ఎవరు పెట్టమన్నారు.. మేం.. రాజన్న అనుచరులం.. ఇక్కడ వైన్ షాప్ పెట్టినందుకు మాకు డబ్బులివ్వాలి’ అంటూ షాపులో పనిచేసే కస్తాలకు చెందిన ఓ వ్యక్తిపై దాడిచేశారు. ఇది ‘మా రాజన్న అడ్డా.. మేం అడిగినప్పుడల్లా మద్యం ఇవ్వాలి’ అంటూ దమ్కీ ఇచ్చారు. దుకాణం నిర్వాహకులు డయల్ 100కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని ఎంతగా వారించినా వినకుండా పోలీసులనే అసభ్యంగా దూషించినట్టు సమాచారం. వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలుండటంతో ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మె ల్యే స్థానిక పరిస్థితులను గమనించి, వారిని కట్టడి చేయకపోతే ప్రశాంతంగా ఉండే చండూరు అరాచక శక్తులకు నిలయంగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.