హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సర్కారు ఆర్థికంగా మరింత పతనమైంది. సచివాలయానికి సరఫరా చేసే తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి దిగజారింది. బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశాడు. వివిధ శాఖలకు సంబంధించి దాదాపు రూ. 20 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. బిల్లుల కోసం కాంట్రాక్టర్ ఎన్నిసార్లు సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి నీటి సరఫరా నిలిపివేశాడు.
తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది చివరికి ఇంటి నుంచి ఎవరి బాటిల్ వారు తెచ్చుకుంటున్నారు. నీటి సరఫరా నిలిపివేతకు సంబంధించి నెల రోజుల క్రితమే సదరు కాంట్రాక్టర్ ఉద్యోగులను అలెర్ట్ చేసినట్టు సమాచారం. శాఖల నుంచి డబ్బులు రావడం లేదని, వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ప్రతినెల రూ. 300 ఇస్తే తాగునీరు సరఫరా చేస్తానని చెప్పడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.