హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగునీటి సరఫరాపై రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసరపనుల నిర్వ హ ణ, వడదెబ్బ నివారణ చర్యలపై బుధవారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా సమష్టిగా పని చేసినందుకు కలెక్టర్లను సీఎస్ అభినందించారు. వేసవిలో నీటిఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని, ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో వస్తున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రా లు, టార్పాలిన్ల వంటివి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలల్లో అత్యవసర మరమ్మతు పనులకు నిధులు విడుదలయ్యాయని, పనులు ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు వచ్చాయని, వెంటనే పనులు వేగవంతం చేయాలని సూచించారు. వడగాడ్పులపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి, కమ్యూనిటీ హెల్త్ వరర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, తదితర సిబ్బందికి అవగాహన కల్పించామని తెలిపారు. వేసవి జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, సీడీఎంఏ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.