కోస్గి, సెప్టెంబర్ 3 : సీఎం ఇలాకాలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కోస్గి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఐదు రోజుల కిందట పైప్‌లైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేపట్టారు. అయినా నీటి సరఫరా జరగపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదు. అయితే తమకు మూడు, నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆపరేటర్లు మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేసినట్టు సమాచారం. దీనిపై ఏఈని వివరణ కోరగా స్పందించలేదు.
మిషన్ భగీరథ కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా నాలుగు రోజుల కిందట పైప్‌లైన్ పగిలిపోగా మరమ్మతులు నిర్వహించినట్టు చెప్పారు. అయినప్పటికీ నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయిందో తనకు తెలియదని అన్నారు. సీఎం ఇలాకాలో నీటి సరఫరా చేసే ఆపరేటర్లకు మూడు, నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం, అధికారులు దీనిపై స్పందించకుండా తలో సమాధానం చెప్పడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.