Kodangal | కొడంగల్, ఫిబ్రవరి 13 : వేసవి రాకముందే సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం టేకల్‌కోడ్ వాసులు రెండు నెలలుగా నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటి ఎద్దడిని నిరసిస్తూ గురువారం మహిళలు ఖాళీ బిందెలతో గ్రామంలోని రోడ్డుపై నిరసన తెలిపారు. గ్రామంలో దాదాపు 500 వరకు ఇండ్లు ఉన్నాయని, ఓ కాలనీలోనే ఇటువంటి పరిస్థితి నెలకొని 150 ఇండ్లకు నీటి సమస్య నెలకొందని వారంటున్నారు. బోర్ల ద్వారా బావుల నుంచి నీటిని తోడుకొని దాహాన్ని తీర్చుకొంటున్నట్టు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదని, బావులపైనే ఆధారపడి కాలాన్ని గడిపిన రోజులు ఉన్నట్టు చెప్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత గ్రామానికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ పైపులు వేసి మంచి నీటిని అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే తమకు కష్టాలు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. నీటి సమస్యపై ఎంపీవో జైపాల్‌రెడ్డిని వివరణ కోరగా.. గ్రామంలో నల్లాలకు మోటర్లు బిగించడం వల్ల ఓ వీధికి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. మోటర్లను తొలగిస్తే సమస్య తీరుతుందని చెప్పారు. గ్రామంలో నీటి ఎద్దడి ఉన్నట్టు తమకు సమాచారం లేదని మిషన్ భగీరథ డీఈ శశాంక్మిశ్రా తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోనే ప్రజలు తాగునీటి గోస ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లోని టేకుల్‌కోడ్ గ్రామ ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కి నిలదీస్తున్న దృశ్యాలను ఆయన ఎక్స్ ద్వారా ఎండగట్టారు. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం జనం అవస్థలుపడే వాతావరణం ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు… కనీసం, తాగునీటి కొరత అయినా లేకుండా చూడండి అని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
మా వీధికి నీళ్లు రాక రెండు నెలలు కావస్తుంది. అధికారులకు చెప్పినా సమస్య తీరడం లేదు. ఉదయం లేవగానే బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నాం. గతంలో మిషన్ భగీరథ నీళ్లకు ఇట్ల ఇబ్బంది పడలేదు. అధికారులు స్పందించి మా గల్లీకి నీళ్లు వచ్చేలా చూడాలి.