మిషన్ భగీరథ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ఆర్డీ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : తాగునీటి సరఫరాపై సర్పంచ్ల ఫీడ్‌బ్యాక్‌కు ప్రాధాన్యమిచ్చి, వారు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. ‘గ్రామస్థాయిలో సర్పంచ్ల అభిప్రాయమే ప్రభుత్వానికి అసలైన మార్గదర్శకం. వారి సూచనల మేరకు మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగుపరుస్తాం. ప్రజలకు నిరంతరం తాగునీరు అందించడమే మా ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయం నుంచి తాగునీటి సరఫరాపై పది రోజులుగా 12,457 మంది సర్పంచ్‌లతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు.
తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల క్లోరినేషన్, పైపులైన్ లీకేజీలు, పంపుల పనితీరు, నల్లా కనెక్షన్, టోల్ ఫ్రీ నంబర్ 1916పై అవగాహన తదితరాలపై వివరాలు సేకరించారు. దీనిపై మంత్రి సీతక శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచ్‌లు గుర్తించిన సమస్యలను పరిషరించాలని, మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకు వెళ్లి పరిశీలించి ఏప్రిల్ 1 నుంచి 15లోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ వ్యవస్థ లేని గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ఓపెన్ వెల్స్ తవ్వించాలని సూచించారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్‌ఫ్రీ నంబర్ 1916కు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని ఆదేశించారు.