హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో తాగునీటిని రెగ్యులర్‌గా అందించాలని చాలాచోట్ల ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ మాత్రం తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేదని, రెగ్యులర్‌గా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నామని చెప్తున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.46,000 కోట్లతో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టారు. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా నల్లాలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 76 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పథకం పర్యవేక్షణ, నిర్వహణ లోపం కారణంగా అనేక గ్రామాలకు సక్రమంగా నీరు అందడం లేదు. కొన్ని గ్రామాలు రోజులు తరబడి తాగునీరు అందకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
మిషన్ భగీరథ పథకం కింద నీటి సరఫరా చేసే ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో తాజాగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రెండ్రోజులు నీటి సరఫరా నిలిచిపోయింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పాటగూడలో భగీరథ పైప్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సరఫరా బంద్ అయింది. గ్రామస్తులంతా కలిసి స్వయంగా బావి తవ్వుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచ్నూర్లో 15 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు రహదారిపై ముల్లకంచె వేసి నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం దోరెపల్లిలో పైప్‌లైన్ పగిలిపోవడంతో 10 రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోయింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అలేడ్లో నాలుగు రోజులుగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్‌లో ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్‌లో పైప్‌లైన్ మరమ్మతులు చేయకపోవడంతో సరఫరా ఆగిపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నసల్ ఎస్సీ కాలనీలో నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలో ఆందోళన చేపట్టారు.
మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. గత నెలలో పంచాయతీ ఇంజినీరింగ్ విభాగం ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. తమ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అదే సమయంలో వేతనాల కోసం ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. మిషన్ భగీరథ నిర్వహణలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈఎన్సీ కార్యాలయం మాత్రం ‘ఎకడా నీటి ఇబ్బంది లేదు.. రెగ్యులర్‌గా తాగునీరు అందిస్తున్నాం’ అని చెప్తున్నది. ఎక్కడైనా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడితే రెండ్రోజుల్లో పూర్తిచేస్తున్నామని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు.
అయిజ/ నాగిరెడ్డిపేట, అక్టోబర్ 3: దసరా పండుగ పూట ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పలేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో గురువారం తెల్లవారుజామున మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాల్సి ఉంది. అదే సమయంలో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన వాల్వ్ రిపేర్‌కు రావడంతో గ్రామానికి నీటి సరఫరా జరగలేదు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. గ్రామస్థులు సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేయడంతో శుక్రవారం ఉదయానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. వాల్వ్‌కు మరమ్మత్తులు పూర్తి చేసి, తాగునీటిని సరఫరా చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లి గ్రామంలోని బోరుమోటర్లు పని చేయకపోవడంతో తాగునీరు లేక నానా అవస్థలు పడ్డారు.
గ్రామంలో తాగునీరు అందించేందుకు రెండు బోరుమోటార్లను ఉపయోగించుకుంటున్నారు. ఒక బోరుమోటరు చెడిపోయి ఆరు నెలలవుతుండగా, మరో బోరుమోటరుకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వృథాగా మారింది. దసరా పండగ వేళ మిషన్ భగీరథ నీరు సైతం రంగుమారి రావడంతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తరలివెళ్లి నిరసన చేపట్టారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.