నారాయణఖేడ్, మే 12: మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మస్తు తిప్పలవుతున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాంతినగర్ తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక సరిహద్దున మూలకు విసిరేసినట్టున్నగా ఉన్న ఈ తండాలో 500 జనాభా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. మిషన్ భగీరథ పథకంతో తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించింది. కాంగ్రెస్ వచ్చాక భగీరథ నిర్వహణలో నిర్లక్ష్యంతో తిప్పలు తప్పడంలేదు.
పది రోజులుగా తండాకు నీరు సరఫరా కాకపోవడంతో కర్ణాటకలోని జమ్గికి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్తు సరఫరా కాగా, ఇప్పుడు విద్యుత్తు సమస్య వెంటాడుతున్నది. రోజుల క్రితం తండాలోని ట్రాన్స్ఫార్మర్ చెడిపోగా, అప్పటి నుంచి అంధకారం అలుముకుంది. గ్రామ ప్రత్యేకాధికారులకు సమాచారం ఇవ్వగా తండావాసులంతా కలిసి డబ్బులు పోగేసి మరమ్మతులు చేసుకోవాలని చెబుతున్నారని గిరిజనలు వాపోయారు.