హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సరార్ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. యూరియా కోసం రోడ్డెకిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్‌రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడైనా ఇలాంటి దుస్థితిని చూశామా? అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో ఎనిమిదేండ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోదీ ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్‌రెడ్డి, గోగుల గౌతమీరెడ్డి (సీనియర్ గైనకాలజిస్ట్) బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు.
రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక హామీనీ అమలుచేయని రేవంత్‌రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం. యూరియా కోసం రైతులు రోడ్డెకితే పోలీసులతో కొట్టిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాష్టీకాన్ని చూస్తూ ఊరుకోం. దీనిపై ఎస్సీ,ఎస్టీ, మానవ హకుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తాం.
-కేటీఆర్
అధికారంలోకి వచ్చి 22నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ‘రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక హామీనీ అమలుచేయని రేవంత్‌రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం. యూరియా కోసం రైతులు రోడ్డెకితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారు. సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాష్టీకాన్ని చూస్తూ ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ, మానవ హకుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. దీని వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టం. రైతులను కొట్టడమేనా రాహుల్‌గాంధీ చెప్పిన మొహబ్బత్ కీ దుకాణ్? పాత రోజులు తెస్తానన్న రేవంత్‌రెడ్డి అన్నంత పనీ చేసి, రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి’ అని అని కేటీఆర్ సూచించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘జీఎస్టీలోని అడ్డగోలు శ్లాబులతో 8 ఏండ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలి. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న హామీ ఏమైంది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తాం, బుల్లెట్ రైళ్లు పరిగెత్తిస్తాం.. వంటి హామీలను మోదీ నిలబెట్టుకోలేకపోయారు. కానీ, దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1,200, రూ. 65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా’ అని విమర్శించారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వానికి నిదర్శమని మండిపడ్డారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని చెప్పారు. మనకు మాత్రం వీరి మోసం అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు? మోదీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. బండివాలా, బఠానీలు అమ్ముకునేవారిని సైతం ఉద్యోగులుగా చెప్పుకోవడం బీజేపీ నేతల సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
జీఎస్టీలోని అడ్డగోలు శ్లాబులతో 8 ఏండ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం శ్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న హామీ ఏమైంది? దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1,200, రూ. 65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారు.
-కేటీఆర్
మోదీ, చంద్రబాబు ఆడిస్తున్నట్టు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ‘చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు ఐదు మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారు?’ అని కేటీఆర్ నిలదీశారు.
గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని, నాయకులుగా తామే విఫలం అయ్యామని కేటీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారు. కానీ, పదేండ్ల్లలో మనం చేసిన పనులను ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయాం. నాయకులుగా మనమందరం విఫలమయ్యాం. మోసం కాంగ్రెస్ నైజం. అడ్డగోలు హామీలు ఇచ్చి గెలిచింది. మనం చేసిన పనిని చెప్పుకోలేక కేవలం 1.8 శాతం ఓట్లతో ఓడిపోయాం. మోసపోతే గోసపడతాం అని కేసీఆర్ ముందే హెచ్చరించారు. ఆయన చెప్పినట్టే ఇవాళ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి’ అని విశ్లేషించారు. గంగుల కమలాకర్, వినోద్‌కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దానిని ఆగం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ గౌతమిరెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న జయశంకర్‌సార్ మాటలను నిజం చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, యూరి యా ఎలా వచ్చాయి? కాంగ్రెస్ రాగానే ఎందు కు కరువయ్యాయి? రేవంత్‌రెడ్డికి సత్తా లేకపోవడమే ఇందుకు కారణం. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కేసీఆర్ ఆపలేదు. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ అంటూ రేవంత్ పరువు తీస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నా రు. కరీంనగర్ ప్రజలు మరోసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్ నగరశాఖ అధ్యక్షుడు తెల్లం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు ఐదు మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారు?
-కేటీఆర్
డాక్టర్ గౌతమీరెడ్డి స్ఫూర్తితో వివిధ వృత్తులవారు బీఆర్ఎస్లో చేరాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా హైదరాబాద్‌ను కేటీఆర్ ప్రపంచలోనే ఒక ఐకాన్‌గా నిలబెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని చెప్పారు. నాడు మారుమూల పల్లెల్లో కూడా నాడు ఎకరం భూమి రూ.30-40 లక్షలు పలికితే.. నేడు అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనేవారు లేరని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్ల క్రితం వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో టాప్‌లో ఉండగా, ఏడాదిలోనే అన్నీ తలకిందులయ్యాయని మండిపడ్డారు.
కరీంనగర్ బీఆర్ఎస్కు కంచుకోట అని, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ‘గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్’.. ‘ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్’గా అభివర్ణించారు. నాడు ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, నేడు యూరియా బస్తా ఉంటే ధనవంతుడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా పార్టీలో చేరుతున్నారంటే 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించి, పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిందని, కాంగ్రెస్ పాలనలో 21 నెలల్లోనే రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేది బీఆర్ఎస్సేనని, అందుకే పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
శంషాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్‌రెడ్డి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రదీప్‌రెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శంషాబాద్ ప్రాంతంలో ప్రదీప్‌రెడ్డికి ఉన్న మంచి పేరు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రదీప్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు, అభిమానులు కూడా బీఆర్ఎస్లో చేరారు.