Everest Base camp | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): వాళ్లిద్దరూ డాక్టర్లు.. ఆమె వయస్సు 68 ఏండ్లు.. ఆయన వయస్సు 71 ఏండ్లు.. అయితేనేం ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను ఎక్కే సాహసయాత్రకు పూనుకున్నారు. వారెవరో కాదు.. మన హైదరాబాదీలే. మారేడ్‌పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి, సంతోష్‌నగర్‌కు చెందిన డాక్టర్ ఏ కృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి కఠ్మాండుకు బలుదేరి వెళ్లారు. ఆదివారం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చాలామందిని పీడిస్తున్న ఊబకాయం, మధుమేహంపై చైతన్యం కల్పించేందుకు వారీ యాత్రకు పూనుకోవడం విశేషం.
అందాలపోటీ కిరీటధారి శోభాదేవి
డాక్టర్ శోభాదేవి గత 20 ఏండ్లుగా బ్రిటన్‌లో ఊబకాయం, మధుమేహం వ్యాధులను నియంత్రించేందుకు నిర్విరామంగా కృషిచేశారు. పుట్టిన గడ్డపై మమకారంతో ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఆమె ఇప్పటికే ఊబకాయం, మధుమేహం వ్యాధులపై ఉచితంగా పలు వైద్య శిబిరాలు నిర్వహించారు. పేదలు, కార్మికులతోపాటు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో సేవలందిస్తున్నారు. భద్రాచలం, జోడేఘాట్ లాంటి ప్రాంతాల్లోనూ వైద్య శిబిరాలు నిర్వహించడం విశేషం. 2019-20 సంవత్సరంలో మిస్సెస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి కిరీటం సాధించారు. వైద్యరంగంలో పలు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందారు.
కరాటేలో దిట్ట కృష్ణారెడ్డి
డాక్టర్ ఏ కృష్ణారెడ్డిది స్వస్థలం నాగర్‌కర్నూల్. హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్-సంతోష్‌నగర్ ప్రాంతంలో క్లినిక్ నడుపుతూ అనేక సేవా కార్యక్రమల్లో పాల్గొంటున్నారు. కరాటేలో ప్రపంచ రికార్డు హోల్డర్‌గా నిలిచారు. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించారు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి సాహసమైనా సాధించొచ్చని యువతకు సూచిస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా అన్ని అంశాల్లో రాణించగలరని తమ యాత్ర నిరూపిస్తుందని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్, ఫిట్నెస్, శ్వాస తీసుకునే ఆసనాలు తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్న తరువాతే ఈ సాహసానికి పూనుకున్నట్టు చెప్పారాయన.