Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల లొల్లి ఆసక్తికరంగా మారుతున్నది. ఎంపీగా పోటీచేసేందుకు తనకు పదవి అడ్డుకాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నెల తిరగకుండానే రవి తన పదవికి రాజీనామా చేయడంపై కాంగ్రెస్‌లో చర్చ నడుస్తున్నది. తనకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టు ఎంపీగా పోటీ చేసేందుకు అడ్డంకిగా మారకూడదని, నాగర్‌కర్నూల్ నుంచి తాను పోటీ చేసి తీరుతానని మల్లు రవి శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశానని, దానిని ఆమోదిస్తారా? లేదా? అనేది ఆయన నిర్ణయం అని రవి సభాముఖంగా తేల్చిచెప్పారు. జడ్చర్ల కాంగ్రెస్ సమావేశంలో రవి చేసిన ఈ ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది.
మల్లు రాజీనామాతో చిక్కుల్లో భట్టి
మల్లు రవి చేసిన ప్రకటన ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మెడకు చుట్టుకున్నది. మాజీ ఎంపీ మల్లు రవి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయానా సోదరులు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ నియోజకవర్గం (ఎస్సీ రిజర్వ్డ్) నుంచి గతంలో రవి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రవి టికెట్ ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రవికి పేరున్నది. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇలా ఉండగా ఖమ్మం పార్లమెంట్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా టికెట్ ఆశించడంతో రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించి రేసు నుంచి తప్పించారు. రేణుకాచౌదరికి అనూహ్యంగా రాజ్యసభ సీటు దక్కడం వెనుక భట్టి పావులు కదిపినట్టు పార్టీలో ప్రచారం జరిగింది. ఒక దశలో ఖమ్మం నుంచి పోటీకి భట్టి భార్య నందినికి లైన్ క్లియర్ అయినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే మల్లు రవి తన నామినేటెడ్ పదవికి రాజీనామా చేసి, తనకు నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్టే ముఖ్యమని ప్రకటించడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ రవికి దక్కితే, భట్టి భార్యకు ఖమ్మం నుంచి అవకాశం దాదాపు లేనట్టే. కాంగ్రెస్‌లో ఒకే కుటుం బానికి మూడు పదవులు అసాధ్యమని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఇవ్వకూడదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనే మినహాయింపు ఉంటుం ది. అలాంటి పరిస్థితిలో ఒకే కుటుంబానికి మూడు పదవులివ్వడం అసంభవమని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రేవంత్‌పై రవి గుస్సా
కోస్గిలో జరిగిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇదే ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్ టికెట్ ఆశిస్తున్న మల్లు రవి అభ్యర్థిత్వంపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై మల్లు రవి గుస్సా అయినట్టు తెలిసింది. తన నామినేటెడ్ పదవితో ఎంపీ అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉన్నదని భావించిన మల్లు రవి తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.