హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న గవర్నర్ తమిళిసై.. ఇకనైనా తన గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి హితవు పలికారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంటేగానీ బిల్లులను ఆమోదించలేని పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. ఇందులోకూడా కొన్ని బిల్లులను ఆమోదించి, మరికొన్ని బిల్లులను తిరస్కరించడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నారు. గవర్నర్ తమిళిసై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఒక వ్యక్తిగా వ్యవస్థను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తుందంటూ చట్ట సభల్లో చెప్పిన గవర్నర్.. బయట ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని కేంద్ర సర్కారు రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నదని, దీనిపై సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.