హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన కురచ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమంత్రిగా ఐటీ ఉద్యోగులను కించపర్చారని మండిపడ్డారు. వారిని అవమానిస్తూ మాట్లాడటాన్ని ఓయూ ప్రొఫెసర్‌గా, ఐటీ పరిశ్రమలో దశాబ్దాలపాటు మానవ వనరుల అభివృద్ధికి కృషిచేసిన వ్యకిగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, బమ్మెర రామ్మూర్తి, ఫయాజ్ అహ్మద్, కాంచన ముదిరాజ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐటీ ఉద్యోగులను అవమానకరంగా వ్యాఖ్యనించిన రేవంత్‌రెడ్డికి తాను బహిరంగ లేఖ రాశానని చెప్పారు. ఐటీ ఉద్యోగులు సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 10 శాతం పైనే ఉన్నదని చెప్పారు. దేశప్రగతికి విశేషంగా తోడ్పడుతున్న ఐటీ ఉద్యోగులను కించపరిచేలా రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని హితవు పలికారు. సీఎం వ్యాఖ్యలను ఐటీ సంస్థలు ఖండించాలని పేర్కొన్నారు. ఫ్యూడల్ మనస్థత్వంతో రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ కృషితోనే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్‌ను ఐటీ ప్రపంచ చిత్రపటంలో ఆయన నిలిపారని, ఈ పరంపరలో లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని దాసోజు శ్రవణ్ గుర్తుచేశారు. కేటీఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయలేదని, ఓ సంస్థ అమెరికా మారెటింగ్ విభాగానికి అధిపతిగా పనిచేశారని తెలిపారు.
లక్షల్లో ఉన్న వేతనాన్ని వదిలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. కేటీఆర్‌ను చులకనగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి ఎకడి నుంచి వచ్చారని, పెయింటర్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం ఎలా అయ్యారని ప్రశ్నించారు. దావోస్‌లోనే ఉన్న చంద్రబాబు అయినా రేవంత్‌రెడ్డికి గడ్డిపెట్టాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట ఎవరుంటున్నారో, ఏ సలహాలు ఇస్తున్నారో అర్థంకావడం లేదని, సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర పరువును అన్ని వేదికలపైన మంటగలుపుతున్నారని విమర్శించారు.