అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని మహా విగ్రహం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా సందర్శకులెవరూ రాకుండా గేట్లకు తాళాలు వేసి, బలగాలను మోహరించిన ప్రభుత్వం
Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. భారత రాజ్యాంగ నిర్మాత.. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ వర్ధంతి రోజునే ఆయనను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా అవమానించింది. అంబేద్కర్ కృషిని, ఆయన స్ఫూర్తిని ప్రపంచ నలుదిశలా చాటేందుకు సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 125 అడుగుల అతిభారీ విగ్రహాన్ని పోలీసులతో నిర్బంధించింది. విగ్రహానికి పూలమాల వేయకపోగా, కనీసం పరిసరాల్లో ఉన్న చెత్తను సైతం తొలగించకుండా తన అక్కసును చాటుకున్నది. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సందర్శకులు కూడా లోనికి వెళ్లకుండా చుట్టూ పోలీసులతో పహారా కాసింది. ప్రధాన గేట్లకు తాళాలు వేసి కనీసం బౌద్ధ మతస్థులను సైతం ప్రార్థన చేయకుండా నిరాకరించింది.
రాష్ర్టానికి తలమానికంగా నాటి బీఆర్ఎస్ సర్కార్ అతి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే నేటి కాంగ్రెస్ సర్కార్ ఆ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయలేదు. పక్కనే ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌కు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో నిండింది. విగ్రహం పక్కన సీఎం మీటింగ్ ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేసినా, విగ్రహ పరిసరాలను మాత్రం వదిలేశారు. దీంతో మేధావులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రజాపాలన అని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్‌రెడ్డి, అంబేద్కర్‌ను అవమానించారని ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. రాచరిక ధోరణితో పాలన సాగిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.
భారీగా పోలీసుల మోహరింపు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విగ్రహ పరిసరాలను శుభ్రం చేసి అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ప్రయత్నించారు. కానీ వారిని ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు రాకుండా అడ్డుకోవడానికి విగ్రహ పరిసరాల్లో వందలాది మంది పోలీసులు మోహరించారు. వాహనదారులు, సందర్శకులు సైతం అక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. విగ్రహం వద్ద ప్రార్థనలు చేసేందుకు చాలామంది బౌద్ధమస్థులు అక్కడికి వచ్చారు. ప్రార్థన చేయడానికి విగ్రహం వద్దకు అనుమతించాలని వేడుకున్నా పోలీసులు లోనికి అనుమతించలేదు. ప్రధాన గేటు ముందు రోడ్డుపై కూర్చొని ప్రార్థనలు చేశారు. మరికొంత మంది బౌద్ధ మత విశ్వాసులు రోడ్డుపైనే పాటల రూపంలో ప్రేయర్ చేశారు. అక్కడ కూడా వారిని ఉండనీయకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు సందర్శనకు రాగా వారినీ అనుమతించకపోవడంతో గేటు బయట నుంచే చూసి వెళ్లిపోయారు.