హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అందులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి ద్వారా చేవెళ్లకు నీరందించేందుకు యోచిస్తున్నట్టు స్పష్టంచేశారు. తమ్మిడిహట్టి నుంచి 71 కిలోమీటర్ల కాల్వపనుల్లో ఇప్పటికే 45 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. మంచిర్యాల జిల్లా మైలారం సమీపం నుంచి నీటిని తరలించేందుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
అందులో మొదటిది మైలారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 50కిలోమీటర్ల దూరంలో ఒక లిఫ్ట్ అవసరముంటుందని గుర్తించామని వెల్లడించారు. రెండోది అదే పాయింట్ నుంచి సుందిళ్లబరాజ్ వరకు సుమారు 55 కి.మీ మేర వరద కాలువ ద్వారా నీటిని తరలించే అవకాశమున్నదని చెప్పారు. రెండు మార్గాలు కూడా తకువ ఖర్చుతో పూర్తయ్యేలా ప్రతిపాదనలు చేయగా, అందుకు అనుగుణంగా అక్టోబర్ నెలాఖరుకు డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దేవాదుల ప్యాకేజ్-3, కల్వకుర్తి ప్యాకేజీ-29, పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజ్-7, ఎస్ఎల్బీసీ టన్నెల్ తదితర ప్రాజెక్టుల పనులపై ఆయన సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మక, సారలమ్మ ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తున్నాం
హనుమకొండ, అక్టోబర్ 11: సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్‌తోపాటు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే విషయంలో తాము వ్యతిరేకమని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు
తెలిపారు.