MP Arvind | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. బీజేపీ నిరుద్యోగ దీక్షలో అరవింద్ మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది బీజేపీయే’ అని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు చాలా ఆలోచించిన తర్వాతే కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేశారని, సర్వేలు, ఫలితాలతో తమకు సంబంధం లేదని, అధికారం మాత్రం చేపడుతామని అన్నారు. దీంతో బీజేపీ తెలంగాణపై రాజకీయంగా ఏదైనా కుట్ర చేస్తున్నదా?
అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదా? అని చర్చించుకుంటున్నారు. అయితే బీజేపీ పప్పులు ఇక్కడ ఉడకకపోవచ్చంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నాడు చంద్రబాబు ఓటుకునోటు ఇచ్చి అడ్డంగా దొరికారని, తాజాగా బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ ప్రతినిధులు పట్టుబడ్డారని గుర్తు చేస్తున్నారు. కుట్రలను ఛేదించడంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని, కాబట్టి బీజేపీ పప్పులు ఉడకవని స్పష్టం చేశారు.