Caste Census | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : కులగణన పేరుతో ప్రభుత్వం చేపట్టబోయే సర్వేపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల సర్వే మాటున సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టే కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వచ్చే నెల 6 నుంచి చేపట్టే ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’కు సంబంధించి ప్రభుత్వం మంగళవారం ‘ప్రశ్నావళి’ని విడుదల చేసింది. ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే’ పేరిట దీనిని చేపడుతున్నది. ఇందులో అడుగుతున్న ప్రశ్నలు చూస్తే మేధావులు, విశ్లేషకుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా జనాభాను గుర్తించే సాకుతో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ సర్వే చేపడుతున్నదని వారు బలంగా వాదిస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో చేపట్టిన కులగణనతో పోల్చుతున్నారు. గతంలో ఏపీలో సర్వే నిర్వహించినప్పుడు కేవలం 25 కాలమ్స్‌లో కుల, వ్యక్తిగత, ఆర్థిక స్థితి గతుల వివరాలు సేకరించారు. బీహార్‌లో 17 ప్రశ్నలతో అత్యంత సులభంగా కులగణన చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా సర్వే చేస్తున్నారు. 56 రకాల వివరాలు సేకరిస్తున్నట్టు ఫారంలో స్పష్టం చేస్తున్నా.. అన్ని ప్రశ్నలు కలిపి 70 వరకు ఉన్నట్టు తెలుస్తున్నది.
సంబంధం లేని వివరాల సేకరణ..
తెలంగాణలో సర్వే ఫార్మాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో (పార్ట్-1) కుటుంబ యజమాని, ఇతర సభ్యుల వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారు. రెండో భాగంలో (పార్ట్-2) కుటుంబ ఆర్థిక, సామాజిక వివరాల ప్రశ్నలు ఉన్నాయి. సర్వేలో కులగణనకు సంబంధంలేని, అవసరం లేని అనేక అంశాలు ఎందుకు చేర్చారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. స్థిర, చరాస్తుల వివరాలు, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా వస్తున్న ఆదాయం, అప్పులు, లబ్ధిపొందిన పథకాలు.. ఇలాంటివన్నీ ఎందుకు అడుగుతున్నారన్న చర్చ నడుస్తున్నది.
60 రోజుల్లో పూర్తిచేయడం సాధ్యమేనా?
సర్వేలోని సంక్లిష్టతలను చూస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లో కులగణన చేపట్టం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు సరైన వివరాలు ఎంత మంది ఇస్తారన్నది ఒక ప్రశ్న. వారు ఇచ్చిన వివరాలు నిర్ధారించుకునేందుకు సంబంధిత పత్రాలను ఇచ్చేందుకు ఎంత మంది సుముఖంగా ఉంటారనేది మరో ప్రశ్న. సర్వేలో అడుగుతున్న వివరాలను బట్టి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించి క్షుణ్ణంగా వివరాలు సేకరించడం కత్తిమీద సామేనని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు అంతిమంగా స్థానిక ఎన్నికల వాయిదాకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సంక్షేమ పథకాలు ఎత్తేసేందుకే ?
ప్రభుత్వం కులసర్వే పేరు చెప్పి కుటుంబాల ఆస్తిపాస్తుల పూర్తి వివరాలు సేకరించడంపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామటుకు కుటుంబాలుగా వేరుగా ఉంటున్నా.. భూములు, ఇండ్లు వంటి స్థిరాస్తులు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. వీటిని ఎవరి ఖాతాలో వేస్తారనేది పెద్ద ప్రశ్న. ఒకే ఇంట్లో అన్నదమ్ములు వేరుపడి రెండు మూడు కుటుంబాలుగా జీవనం కొనసాగిస్తుంటారు. వారందరికీ సొంత ఇల్లు ఉన్నట్టుగా పరిగణిస్తారా? లేక రికార్డుల్లో ఆ ఇంటి యజమాని పేరు మాత్రమే రాసుకొని, మిగతావారిని ఇల్లు లేనివారిగా నమోదు చేస్తారా? అనేది స్పష్టత లేదు. ఒక ఇంట్లో రిజర్వేషన్ల ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందితే వారిని ప్రత్యేక కుటుంబంగా పరిగణిస్తారా? లేదా ఇంట్లో ఉన్న అందరూ ప్రయోజనం పొందినట్టు భావిస్తారా? అనేదీ స్పష్టత ఇవ్వలేదు. ఈ సాకుతో వారిని ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తారన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.