హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘ఓటుకు నోటు’ కేసు (Vote for Note Case) విచారణ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్వేచ్ఛగానే జరుగుతున్నదా? ఏసీబీ డీజీ అసలు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలనే సంకల్పంతో నడిపిస్తున్నారా? దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారా? కేసులో న్యాయబద్ధమైన ముగింపు కోసం సరైన విధానాలు పాటిస్తున్నారా? నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా?.. సుప్రీంకోర్టులో ఏసీబీ తరఫు కౌన్సిల్స్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయని అటు న్యాయనిపుణులు, ఇటు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. కేసు విచారణలో ఏసీబీ స్వతంత్రతపై పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేదిశగా అడుగులు పడుతున్నాయని వారు అనుమానిస్తున్నారు. ఓటుకు నోటు కేసు 2015లో మే నెలలో దేశంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. స్టీఫెన్సన్ ఇంట్లో 2015 మే 31న అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రూ.50 లక్షలు నగదుతో సహా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏ1 నిందితుడు కాగా, జెరూసలేం మత్తయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రావు తదితరులు సహ నిందితులుగా ఉన్నారు. అప్పటినుంచి కేసు విచారణ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నది. హైకోర్టులో విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. రేవంత్‌రెడ్డి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నిరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రికావడంతోపా టు హోంమంత్రిగా కూడా రేవంత్‌రెడ్డే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ, డీజీపీ, ఏసీబీ వంటి దర్యాప్తు విభాగాలన్నీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాయని, కాబట్టి ఓటుకు నోటు కేసు విచారణను నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని కోర్టుకు విన్నవించారు. అందువల్ల విచారణను వేరే రాష్ర్టానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నిరుడు సెప్టెంబర్ 20న తీర్పు ఇచ్చింది. దర్యాప్తులో ముఖ్యమంత్రి/హోం మంత్రి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఏసీబీ డీజీ వారికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించింది. ఒకవేళ సీఎం జో క్యం చేసుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పిం ది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే ఏసీబీ డీజీ సుప్రీం ఆదేశాలను అమలు చే స్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ స్వతంత్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఈ నెల 22న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఈ నెల 22న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అకస్మాత్తుగా ‘ఓటుకు నోటు’కు సంబంధించిన మరో రెండు కేసులు సుప్రీంకోర్టులోని కోర్ట్ నంబర్ 4లో ఈ నెల 26న లిస్ట్ అయ్యాయి. సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ (ఎస్ఎల్పీ, సీఆర్ఎల్ – 3932/2021), రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ (ఎస్ఎల్పీ, సీఆర్ఎల్ – 5333/2021)పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపనున్నది. వాస్తవానికి ఈ కేసులను గతంలో ఎప్పుడూ ఈ ధర్మాసనం విచారణ జరపలేదని సుప్రీంకోర్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఈ కేసులను కలిపి చివరిసారిగా 2024 జనవరి 5వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంటే ఫిబ్రవరిలో విచారణకు రావాల్సి ఉన్నది. కానీ జనవరి 5 తర్వా త ఇప్పటివరకు లిస్ట్ కాలేదు. అకస్మాత్తుగా ఈ నెల 26న కొత్త బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.
సాధారణంగా ఒక ఎఫ్ఐఆర్పై నమోదైన కేసుకు సంబంధించి ఒక ధర్మాసనం వాదనలు పూర్తిగా విని, తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత, అదే ఎఫ్ఐఆర్పై కోర్టులో దాఖలయ్యే పిటిషన్లను పాత ధర్మాసనానికే బదిలీ చేస్తారు. ఇది అన్ని స్థాయిల న్యాయస్థానాల్లో సంప్రదాయంగా కొనసాగుతున్నది. అప్పటికే ఆ కేసును న్యాయమూర్తులు అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి, వాదనలు సులభం అవుతాయని ఈ ప్రక్రియను పాటిస్తుంటారు. కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం ఇందుకు భిన్నంగా సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు కొత్త ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. దీంతో అటు న్యాయవర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఒకే ఎఫ్ఐఆర్పై నమోదైన కేసులను ఒకే ధర్మాసనానికి బదిలీ చేయడం రిజిస్ట్రీ బాధ్యత అని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఒకవేళ రిజిస్ట్రీ ఈ విషయాన్ని గుర్తించలేకపోతే కేసులో ఏసీబీ తరఫున వాదనలు వినిపిస్తున్న కౌన్సిల్ ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ అలా చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఏసీబీ డీజీ తరఫు కౌన్సిల్ ముందే గుర్తుచేసి ఉంటే, గురువారం జెరూసలెం మత్తయ్య పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్లపైనా తీర్పు వెలువడే అవకాశం ఉండేదని చెప్తున్నారు.