హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మోదీ స్కూలులో, చంద్రబాబు కాలేజీలో చదువుకున్నాను… రాహుల్‌గాంధీ వద్ద ఉద్యో గం చేస్తున్నా ఇదీ ఆదివారం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బీజేపీ నేతలు, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యపక్షాల నాయకులు పాల్గొ న్న ఈ సభలో కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం, రేవంత్‌రెడ్డి ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ సభకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఒకప్పటి బీజేపీ నేతలు, ప్రస్తుత గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, కంభంపాటి హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా వందల మంది బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సభలో రేవంత్‌రెడ్డి వ్యవహారం చూసిన చాలా మంది ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారు. బీజేపీ నేతలను ఇంతలా ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడటం వెనుక ఆంతర్యమేంటని చర్చించుకుంటున్నారు. సాధారణంగా మనం చదువుకుంటున్న స్కూలు గురించి, కాలేజీ గురించి గర్వంగా, ఘనంగా చెప్పుకుంటాం. అదే సమయంలో ఉద్యోగం ప్రస్తావన కొంత సందిగ్ధంగా ఉంటుంది. ఇక్క డ చేస్తున్నది ఉద్యోగం అని చెప్పడంతో.. ఇక్క డ కాకపోతే ఇంకోచోటైనా ఆ ఉద్యోగం చేస్తానననే ధ్వని పొంచి ఉంటుంది. అలాగే రాహుల్‌గాంధీ దగ్గర ‘ఉద్యోగం’ చేస్తున్న అని బీజేపీ వేదికపై చెప్పడం ద్వారా నేను మీ మనిషినే, అవసరార్థం అక్కడ ఉన్న అనే సందేశం బీజేపీ నేతలకు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నదని, ప్రస్తుత ఉద్యోగం ఎప్పుడైనా మానేయవచ్చనే సంకేతం కాంగ్రెస్ పెద్దలకు పంపినట్టే కనిపిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్‌నేత ఒకరు విశ్లేషించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత రాహుల్‌గాంధీ బీజేపీపై విరుచుకుపడుతుంటే ఆశ్చర్యకరంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు తహతహలాడటం గమనార్హం. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాటి నుంచే బీజేపీ పాట, పల్లవి అందుకున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చినపుడు గుజరాత్ మాడల్‌లో తెలంగాణలో అభివృద్ధి జరగాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం కావాలి అని నిరుడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి ఎదుట రేవంత్‌రెడ్డి పొగిడారు. ఇదే సభలో మోదీని బడేభాయ్ అని సంబోధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని మాట్లాడారు.
బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తమ పార్టీ నేతలు భేటీలు జరుపుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదంతా ఇలా ఉంటే కేంద్రమంత్రులు ఎవ్వరు వచ్చినా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమయం ఇచ్చి మరీ కలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమైతే ఫర్వాలేదు. కానీ, ఇన్ని భేటీల తర్వాత కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక్కటంటే ఒక్క ప్యాకేజీ, నిధులు రాలేదు. కేంద్రం నుంచి తెలంగాణకు ప్రయోజనకరంగా ఉన్న ఒక్క పని కూడా జరగలేదు. పనులు జరగకపోయినా.. నిధులు రాకపోయినా ముఖ్యమంత్రి కొందరు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తే స్వయంగా వెళ్లి స్వాగతం పలుకుతుంటారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి స్వయంగా అనేక ఇంటర్వ్యూల్లో తాను గెలిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంత సహకరించారో చెప్పారు.
నీతి ఆయోగ్ సమావేశాలకు తాను వెళ్లబోనని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్ సమావేశాలకు రావడంలేదు. ఇవన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయన్నది వారి వాదన. అయితే విచిత్రంగా రేవంత్‌రెడ్డి గత నెలలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు. ఆ సమావేశానికి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెళ్లలేదు. వెళ్లినవాడు కనీసం కాంగ్రెస్ ఏజెండాలోని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది రాజకీయంగా పెనుసంచలనం అయింది. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఎన్డీయే పక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రోజంతా రేవంత్‌రెడ్డి గడపటం బీజేపీతో రేవంత్ అల్లుకుంటున్న బంధానికి నిదర్శనమని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలోని బీజేపీ ముఖ్యనేతలెవ్వ రూ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డిపై పెద్దగా ఏమీ మాట్లాడడంలేదు. ప్రభుత్వ తీరును, పాలనాలోపాలను ఎండగట్టకపోగా మద్దతుగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. రఘునందన్‌రావు, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్.. ఇలా ఎంపీలందరూ రేవంత్‌రెడ్డితో సయోధ్యతో ఉంటున్నారని విమర్శలున్నాయి. దీనికి తగ్గట్టుగానే వారి వ్యవహారశైలి కూడా కనిపిస్తున్నది. గడిచిన 18 నెలల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్.. రేవంత్‌రెడ్డిని విమర్శించిన దాఖలాలే లేవు. ఇక రఘునందన్‌రావు అయితే ఏకంగా రేవంత్ సర్కారుకు బాకా ఊదుతున్నారన్న విమర్శ ఉంది. బీజేపీ, రేవంత్‌రెడ్డి మధ్య మంచి మైత్రి కొనసాగుతున్నదన్న ఆరోపణలున్నాయి.