హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లు ఎక్కడుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించింది. బిల్లును గవర్నర్‌కు పంపి చేతులు దులుపుకుందని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన వెంటనే ఢిల్లీ వెళ్లి హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పటికీ 2 నెలలు గడిచినా గవర్నర్ ఆమోదానికి చొరవ చూపకవడమేంటని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన నిర్వహిస్తాం. కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 23శాతం నుంచి 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తాం.” అని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ అశాస్త్రీయ పద్ధతిలో కులగణనను నిర్వహించిందని బీసీ సంఘాలు మండిపడుతున్నారు. ఆ తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మార్చి 17న శాసనసభ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టగా, బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అనంతరం ప్రభుత్వం ఆ బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపింది. బిల్లులను అసెంబ్లీ ఆమోదించిన వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ పెద్దలు దేశానికే ఆదర్శంగా నిలిచామని గొప్పగా చెప్పుకున్నారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేందుకు కోసం కాంగ్రెస్ సర్కారు, ప్రభుత్వ పెద్దలెవరూ ఎలాంటి చురుకైన ప్రయత్నాలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండునెలలుగా పెండింగ్‌లో ఉన్నా కూడా ఆ ఊసెత్తని పరిస్థితి. బిల్లులను అటకెక్కించే ఉద్దేశమే తప్ప మరేమీ లేదని బీసీ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
శాసనసభ ఆమోదించిన తర్వాత బిల్లులను తక్షణమే గవర్నర్ ఆమోదం కోసం పూర్తి సమాచారంతో పంపాల్సి ఉందని నిపుణులు చెప్తున్నారు. గవర్నర్‌తో సంప్రదింపులు, తగిన నిబంధనల రూపకల్పన వంటి కీలక ప్రక్రియలు ప్రభుత్వం చేపట్టాలని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గతంలో బీహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచే బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి, తక్షణమే గవర్నర్‌కు పంపి ఆమోదం పొందింది. కానీ తెలంగాణలో మాత్రం బిల్లులను గవర్నర్ తిరస్కరించినట్టుగానీ, ఇతర సమాచారం కావాలని అడిగనట్టుగానీ రాజ్‌భవన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం గవర్నర్‌తో ప్రత్యక్షంగా ప్రభుత్వం చర్చించిన దాఖలాలు లేదు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని కులసంఘాల ప్రతినిధులు వివరిస్తున్నారు. గవర్నర్ నమ్మదగిన, చట్టబద్ధమైన ఆధారాలతో ఒప్పించాల్సిన ప్రయత్నమే రేవంత్సర్కార్ చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు.
గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండడం, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం, కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే గణాంకాలకు ప్రామాణికత లేకుండా పోయింది. మరోవైపు ఆ గణాంకాల ఆధారంగా కల్పించిన రిజర్వేషన్లు చెల్లని పరిస్థితి ఏర్పడిందని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు అటకెక్కినట్టేనని నిప్పులు చెరుగుతున్నారు.