హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల్లో ఉన్న డబుల్ ఓట్లను తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాసినట్టు గాంధీభవన్‌లో శుక్రవారం మీడియాకు తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే హైదరాబాద్‌లో ప్రస్తుత ఎన్నికల్లో 0.7 శాతం పోలింగ్ తగ్గిందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తగ్గిందని తెలిపారు. ఆయా కారణాలపై ఎన్నికల కమిషన్ లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, హైదరాబాద్ నగరంలో బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చివరకి చనిపోయిన వారికి కూడా ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మందికి తెలంగాణలో, ఆంధ్రాలో రెండుచోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.