ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రాచకొండ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలిందని, ఈ విచారణ నివేదికను కలెక్టర్కు అందజేశామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. మంచాల మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 5న వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఇందుకు కలెక్టర్ స్పందించారు. విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక అందజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీవో అనంతరెడ్డి రెండు రోజుల క్రితం కలెక్టర్కు నివేదిక అందజేశారు.
మండలంలో గతంలో అమ్మిన భూములకు అప్పటి రైతుల పేరిట పాస్బుక్లు వచ్చినందున వాటిని తిరిగి ఇతరులకు విక్రయిస్తున్నట్టు తెలిసిందని.. ఆ భూములపై రెండోసారి కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారని ఆర్డీవో వివరించారు.