హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దేశంలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రసంగంపై మంత్రి మండిపడ్డారు. మోదీ మాటలు అన్నీ అబద్ధాలేనన్నారు. రూ.1500 కోట్ల వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగమే అబద్ధాల మయం అనుకుంటే అందులో రహదారుల నిర్మాణం అంటూ.. చెప్పిన మాటలకు పొంతనే లేదన్నారు.
రోడ్లకు నిధులిచ్చింది ఏమీ లేదన్నారు. మహానగరం హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన అని, దాన్ని అమలు చేసిన ఘనత మంత్రి కేటీఆర్‌దేనన్నారు. 46 చోట్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటైతే.. ఆ క్రెడిట్ తమదే అంటూ మోడీ గొప్పలు చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు. రూ.50వేలకోట్లతో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు.
రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్ మూడింతలు, మధ్యప్రదేశ్ రెండింతలు పెద్దదని.. అక్కడ ప్రభుత్వాలు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతున్నది ఎంతో దేశ ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ‘2014కు ముందు.. వెనుక అన్నది’ అధ్యయనం చేస్తేనే అభివృద్ధి గురించి తెలుస్తుందన్నారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలనీ, ఆ విజయాల వెనుక సీఎం కేసీఆర్ దార్శనికత ఉందన్నారు. దాంతో అద్భుతమైన పాలనను అందించగలుగుతున్నామని, అది హస్తినకు విస్తరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.