అచ్చంపేట, జూన్ 27 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నివాసముంటున్న సుజాత తల్లిగారింటికి వెళ్లి వచ్చేలోగా తనకు డబుల్ బెడ్రూం ఇల్లును వేరొకరికి కేటాయించారు. వివరాల్లోకి వెళితే.. అచ్చంపేటకు చెందిన సుజాత భర్త కురుమూర్తి 2019లో మృతిచెందాడు. అద్దె ఇంట్లో ఉంటూ కుట్టుమిషన్ కుడుతూ ఇద్దరు పిల్లలను పోషించేది. ఈమెకు లక్కీడ్రా లో రాజీవ్‌నగర్ కాలనీలో డబుల్ బెడ్రూం వచ్చింది. అధికారులు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ఇల్లు కేటాయించారు. తర్వాత సొంత డబ్బు లు పెట్టి మరమ్మతులు చేయించుకున్నది. కొన్ని నెలలకు ఆమె కుమారుడు మృతి చెందడంతో తల్లిగారింటికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా, అచ్చంపేట ఆర్డీవో మాధవి ఇంట్లో పనిమనిషి జగదాంబకు ఇదే ఇల్లు కేటాయించినట్టు తెలుసుకున్నది. ఆర్డీవో మాధవిని ప్రశ్నించగా.. దుర్భాషలాడడంతో పాటు తాను చూపించిన డబుల్ బెడ్రూం ఇంటి ప్రొసీడింగ్ కాపీని విసిరికొట్టారని సుజాత ఆరోపించారు. ఈ నెల 23న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లారని తెలిపింది. పేదల పొట్టకొడుతున్న ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.